ఉల్లి ధరలు మళ్లీ ఆకాశాన్ని తాకాయి. ప్రస్తుతం ఉల్లి ధర కిలో 90 రూపాయలకు చేరుకుంది. పలు రాష్ట్రాల్లోనైతే సెంచరీ కూడా కొట్టేసింది. మహారాష్ట్రలో కొత్తగా మార్కెట్‌కు రావాల్సిన పంట వర్షాలకు దెబ్బతినడంతో తీవ్ర కొరత ఏర్పడింది. దీంతో.. ఇప్పటి వరకు ఉన్న పాత నిల్వలన్నీ తగ్గిపోవడంతో ఉల్లి క్వింటా 6వేల రూపాయలు పలుకుతోంది. దేశంలోనే అతిపెద్ద హోల్‌సేల్‌ ఉల్లి మార్కెట్‌ అయిన లాసాల్‌గావ్‌లో కిలో ధర 56 రూపాయలుగా ఉంది. ఉల్లిని ప్రధానంగా పండించే నాసిక్‌, అహ్మద్‌నగర్‌, పుణెల్లో గత రెండు వారాల్లో భారీ వర్షాలు కురిసి పంట నష్టం జరిగింది. వర్షాలు ఇలాగే కొనసాగితే ధరలు మరింత పెరిగే అవకాశాలున్నాయి.


కర్నూలు, కర్నాటక నుంచి తెప్పిస్తున్న సరుకు నాణ్యత లేక ఎక్కువ రోజులు నిల్వ చేయలేకపోతున్నారు. నాణ్యమైన ఉల్లి క్వింటా హోల్‌సేల్‌లో 4 వేల రూపాయలు పలుకుతోంది. దీంతో రోడ్డెక్కి ఆందోళనలు చేస్తున్నారు అక్కడి రైతులు. అవి కాస్తా.. నిల్వ చేస్తే పాడవుతుండటంతో.. చిల్లర దుకాణాలకు వచ్చేసరికి ధర విపరీతంగా పెరిగిపోతోంది. అందుకే ఆచితూచి కొంటున్నారు వ్యాపారులు. గత నెలలో ఇలానే ధరలు పెరగడంతో ఏపీలో మార్కెటింగ్‌ శాఖ జోక్యం చేసుకుని రాయితీపై కిలో 25 రూపాయలకు అమ్మడంతో ధరలు అదుపులోకి వచ్చాయి. ఆ తర్వాత ఆ అమ్మకాలు ఆపేశారు. ప్రస్తుతం మళ్లీ ఉల్లి ధరలు పెరుగుతుండటంతో మరోసారి వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


కర్ణాటక, కర్నూలు నుంచి రావాల్సిన పంట ఆశించిన స్థాయిలో లేకపోవడంతో స్థానిక అవసరాలకు మహారాష్ట్ర ఉల్లిపాయలపైనే ఆధారపడాల్సివస్తోంది. అక్కడి మార్కెట్లలో పాతవి క్వింటా 6 వేల రూపాయల ధర పలుకుతుండటంతో ఆచితూచి కొనుగోలు చేస్తున్నారు స్థానిక వ్యాపారులు. రోజుకు 50 బస్తాలు విక్రయించే హోల్‌సేల్‌ వ్యాపారులు 20 బస్తాలకి మించి అమ్మలేకపోతున్నారు. పెద్ద పెద్ద హోటళ్లు, క్యాటరింగ్‌ నిర్వాహకులు, పకోడి వేసే వ్యాపారులు తప్పనిసరి పరిస్థితుల్లో పెరిగిన ధరకు కొంటున్నారు. చిరువ్యాపారులు, సామాన్య వినియోగదారులు కర్నూలు ఉల్లితో సరిపెట్టుకుంటున్నారు. ఏదేమైనా వర్షాలు తగ్గి కొత్త పంట మార్కెట్లోకి వస్తేగానీ పరిస్థితులు చక్కబడే అవకాశాలు కనిపించడం లేదని మార్కెట్‌వర్గాలు విశ్లేషిస్తున్నాయి. దీంతో వినియోగదారులకు ఉల్లి కన్నీళ్లు తప్పేలా లేవు. 
 మరింత సమాచారం తెలుసుకోండి: