టీవీ ప్రసారాల ద్వారా చారిత్రక, సాంస్కృతిక, శాస్త్రీయ, సైద్ధాంతిక, విజ్ఞానదాయక, పరిశోధనాత్మక సమాచారాన్ని సమాజం అందుకుంటున్నది అనడంలో అతిశయోక్తి గాని వివాదాస్పదం కాని లేదు. అయితే అంతకు మించిన స్థాయిలో సమాజంలోని భిన్న వర్గాలను ముఖ్యంగా మహిళలు, యువతను నైతిక పతనానికి తీసుకువెళుతుంది అనడంలో సందేహం లేదు.  ప్రత్యక్షంగా చూడడం ద్వారా ప్రసార మైనటువంటి కొన్ని అంశాలు వ్యతిరేక భావజాలాన్ని కలిగి ఉండే సందర్భంలో అవి సమాజం పై చూపే ప్రభావం అంతా ఇంతా కాదు. టీవీ ప్రసారాలు సినిమా రంగం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో పని చేస్తున్నటువంటి ఒక శాఖ. పరిపాలలో భాగంగా వివిధ శాఖల ద్వారా ప్రజల అవసరాలను తీర్చడానికి ప్రభుత్వం యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకొని సక్రమ నిర్వహణ తోపాటు లోటుపాట్లను సరి చూడడానికి కూడా చట్టబద్ధమైన అధికారం కలిగి ఉంటుంది. ప్రభుత్వాలు కూడా ప్రజల కోణంలో ఆలోచించ నప్పుడు వ్యతిరేక ఫలితాలు వచ్చే ఆస్కారం ఉంటుంది .కనుక సమర్థవంతమైన పరిపాలన మాత్రమే దుష్ప్రభావాలను అడ్డుకట్ట వేయగలదు. అన్ని రంగాలలో కూడా ఇదే తంతు కొనసాగుతుంది.

      టీవీ ప్రసారాల అశ్లీలత చట్టబద్ధమా..?

    సంస్కృతి సంప్రదాయాలను గౌరవిస్తూ నైతిక విలువలు పెంపొందించడం ద్వారా కొత్త తరాన్ని జాతికి అందించ వలసిన బాధ్యత టీవీ ప్రసారాల పైన ఎంతగానో ఉన్నది. అయితే ఆచరణలో టీవీలో  ప్రసారమవుతున్న అంశాలు ఎంత జుగుప్సాకరంగా ఉన్నాయో! మనం అందరం చూస్తూనే ఉన్నాం. తెలంగాణ ఆకాంక్షలు అనుకున్న మేరకు అమలు కానప్పటికీ అటు ప్రభుత్వo ఇటు మేధావులు ఎలా మౌనంగా ఉన్నారో టీవీ ప్రసారాలలోని అసంబద్ధ విధానాల పట్ల కూడా ప్రభుత్వాలు ప్రజలు మేధావులు కూడా మౌనంగా ఉన్నారు. ఇది సమాజానికి ప్రమాదకరమైన సంకేతం.
      సామాన్య ప్రజానీకం యొక్క జీవితంతో సంబంధం లేకుండా, పేదల జీవితంతో ముడి పడకుండా, కిలోల కొద్ది బంగారం, కుట్రలు కుతంత్రాలతో కూడిన సీరియల్ మనిషి మెదళ్ళలో విషం నింపుతున్న వి. మరొకవైపు ధూమ్ ధామ్ ,జబర్దస్త్ ,బిగ్బాస్ వంటి అనేక కార్యక్రమాలలో నిర్వాహకులు, న్యాయనిర్ణేతల తో పాటు, భాగస్వాములు అవుతున్న వాళ్లు ముఖ్యంగా మహిళలు ఎంత అర్థనగ్నంగా వ్యవహరిస్తూ యువతను రెచ్చగొడుతూ తమ శరీరాలను చూసుకొని మురిసిపోతున్నారో మనమందరం కళ్ళారా చూస్తూనే ఉన్నాము. అయితే ఎందుకు వ్యతిరేకించడం లేదు?. శరీరం మీద నూలు పోగులు ఉన్నాయా..? లేదా..? అనే దుర్మార్గపు సంప్రదాయాన్ని సొమ్ముచేసుకుంటున్న నిర్వాహకులు నిర్మాతలు ప్రభుత్వాలు సెన్సార్ సభ్యులు ఎందుకు మౌనంగా ఉంటున్నారు. మౌనంగా ఉండడమే మీ సమాధానం అయితే, అశ్లీల సాంప్రదాయాన్ని సంస్కృతిని పెంచి పోషించడమే మీ బాధ్యత అనుకుంటే, బాధ్యతల నుండి తప్పుకోవడమే సరైన మార్గం. హైదరాబాదులో పలు చోట్ల జనావాసాల మధ్య నిర్వహిస్తున్న పబ్బులలో అశ్లీల దృశ్యాలు, మద్యం, మత్తు పట్ల స్థానిక ప్రజలు నిన్న వివిధ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. అంటే ఆ విషయాలు పోలీసులకు తెలియవా..? సమాజానికి హాని చేసే అత్యాచారాలు, అకృ త్యాలకు కారణమవుతున్న ఇలాంటి సన్నివేశాలను, ప్రదర్శనలను ,పబ్బులను ప్రభుత్వం ఎందుకు నిషేధించడం లేదు.

 
 భారత దేశ వ్యాప్తంగా ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల ఎన్నికలoటే మురిసిపోతూ, ప్రజల దృష్టిని మళ్లించడానికి పరస్పర ఆరోపణలతో రాద్ధాంతం చేస్తూ, అక్రమార్జనకు పాల్పడుతున్నారు. ఇటువంటి రాజకీయ నాయకులు, ప్రభుత్వ పెద్దలు, మంత్రులు టీవీ ప్రసారాల ద్వారా నాశనం అవుతున్న ప్రజల సంస్కృతిని కట్టడి చేయడానికి ఎందుకు పూనుకోరు. 2014లో అధికారానికి రాకముందు తెరాస పార్టీ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో టీవీ ప్రసారాలు సినిమాలలోని అసంబద్ధ అశ్లీల విధానాలను ఖచ్చితంగా నిషేధిస్తామని, ప్రజా సంస్కృతిని పెంపొందిస్తామని హామీ ఇచ్చిన ప్పటికీ ఒక్క శాతం కూడా అమలు కాలేదంటే  దుష్ట,దుర్మార్గ, రెచ్చగొట్టే సంస్కృతి ప్రసారాలకు ప్రభుత్వం బాధ్యత వహించాల్సిన అవసరం లేదా..

మరింత సమాచారం తెలుసుకోండి: