ఇటీవలే జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఓ కిడ్నాప్ కేసు ఎంత కలకలం సృష్టించింది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏకంగా పోలీసులను పరుగులు పెట్టించి ఈ కిడ్నాప్ కేసు లో ఇక అసలు విషయం తెలిసి అందరూ అవాక్కయ్యారు అని చెప్పాలి. అక్కడ జరిగింది నిజమైన కిడ్నాప్ కాదు ఒక విద్యార్థి ఆడిన నాటకం అనే విషయం బయటపడింది. తల్లిని వదిలి హాస్టల్ కి వెళ్లడం ఇష్టం లేని పిల్లాడు చివరికి ఇలా కిడ్నాప్ నాటకం ఆడాడు అన్న విషయం పోలీసు విచారణలో తేలింది. కొన్ని రోజులపాటు ఎంతో సీరియస్గా పోలీసులు కిడ్నాప్ కేసు ఛేదించేందుకు దృష్టి పెట్టారు.


 ఈ కేసు విచారణ ఒక సస్పెన్స్ త్రిల్లర్ సినిమాకు ఎక్కడ తీసిపోలేదు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ కు చెందిన 11 ఏళ్ల బాలుడు సోషల్ వెల్ఫేర్ స్కూల్ లో ఆరో తరగతి చదువుతున్నాడు. కరోనా కారణంగా గత రెండేళ్ల నుంచి ఇంట్లోనే ఉంటున్నాడు. అయితే ఇటీవలే స్కూల్స్ తెరుచుకోవడంతో  హాస్టల్ కు వెళ్లాల్సి వచ్చింది. తన తల్లిని వదిలి వెళ్లడం అతనికి అస్సలు ఇష్టం లేదు. ఈ క్రమంలోనే ఇక టిఫిన్ చేసి రాపో అంటూ తల్లి అతన్ని బయటకు పంపింది. టిఫిన్ సెంటర్ కి కాకుండా పెట్రోల్ బంక్ వరకు వెళ్లి ఒక బస్సు ఎక్కాడు సదరు బాలుడు.


 ఇక ఆ తర్వాత పరకాల లో బస్సు దిగి అక్కడి నుంచి టాటా మ్యాజిక్ వాహనంలో హనుమకొండ కు వెళ్ళాడు.హనుమకొండలో ఆ పిల్లాడి అక్క ఉంటుంది. అక్క దగ్గరికి వెళ్దాం అనుకున్నాడు. హనుమకొండ లో దిగిన తర్వాత అక్క ఇంటి అడ్రస్ మర్చిపోయాడూ. దీంతో ఏం చేయాలో అర్థం కాలేదు. ఇంటికి వెళ్తే మళ్ళీ హాస్టల్ కు పంపిస్తారనే భయం.. ఇంతలో  ఓ కొబ్బరి తాడుతో చేతులు కట్టుకున్నాడు. ఇక బస్ స్టాప్ లో కూర్చుని ఏడుస్తూ ఉండటం మొదలు పెట్టాడు. అటువైపుగా వెళ్తున్న ఒక వ్యక్తి ఏం జరిగింది అని అడుగగా.. నన్ను ఎవరో కిడ్నాప్ చేశారు అంటూ ఏడుస్తూ చెప్పాడు. వాళ్ళ అమ్మ ఫోన్ నెంబర్ ఇవ్వడంతో ఇదంతా సదరు వ్యక్తి ఫోన్ చేసి కుటుంబ సభ్యులకు చెప్పారు. కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా ఇక ముగ్గురు విద్యార్థులు కిడ్నాప్ అంటు వార్తలు హల్ చల్ చేశాయి. కానీ ఆ తర్వాత ఎక్కడో పోలీసులకు అనుమానం వచ్చింది. దీంతో పిల్లాడిని గట్టిగా అడిగారు దీంతో పోలీసుల తీరుకు భయపడి అసలు విషయం చెప్పేశాడు. దీంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: