చిన్న పిల్లలు ఆడుకుంటున్న సమయంలో ఏవో ఒకటి మింగేస్తారు. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా తల్లిదండ్రులు తమ పిల్లలు వేటితో ఆడుకుంటున్నారో ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి. పొరపాటున ఏవో ఒకటి మింగేస్తే ప్రాణాపాయ పరిస్థితులు ఏర్పడవచ్చు. అయితే పెద్ద వారు మాత్రం కావాలని ఏదీ మింగే అవకాశం ఉండదు. ఆశ్చర్యకరంగా ఓ వృద్ధుడు తినకూడనిది తినేశాడు. టాబ్లెట్‌తో పాటు దాని చుట్టూ ఉండే అల్యూమినియం కవర్‌ను మింగేశాడు. అది జీర్ణాశయం లోపలికి వెళ్లకుండానే అన్నవాహికలో ఇరుక్కుపోయింది. దీంతో అతడు ఆగమేఘాలపై ఆసుపత్రికి వెళ్లాడు. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

ఢిల్లీలోని గంగారామ్ హాస్పిటల్‌ లో ఇటీవల ఓ వృద్ధుడు తనకు శరీరం లోపల ఏదో నొప్పి ఉందని బాధ పడుతూ అడ్మిట్ అయ్యాడు. దీంతో అతడికి ఏమైందోనని ఆసుపత్రి వైద్యులు కంగారు పడ్డారు. వెంటనే ఆ వృద్ధుడికి స్కానింగ్ చేశారు. అందులో ఏదో ఉందని స్పష్టమైంది. పరిశీలించి చూడగా ట్యాబ్లెట్‌ తో పాటు, దాని చుట్టూ ఉండే అల్యూ మినియం కవర్ మింగేశాడని వైద్యులకు అర్థం అయింది. చివరికి వైద్యులు ఆ వ్యక్తి ఫుడ్ ట్యూబ్‌ లో ఇరుక్కున్న అల్యూమినియం రేకులోని డ్రగ్‌ను విజయవంతంగా తొలగించారు. కొత్త ఎండోస్కోపీ టెక్నిక్ ఉపయోగించారు. ఎగువ జీర్ణశయాంతర ఎండోస్కోపీని ఉపయోగించడం అనేది కడుపు నుండి ఏదైనా బయటి వస్తువును సేకరించే సాధారణ ప్రక్రియ. సాధారణంగా ఇలాంటి కేసులు చిన్న పిల్లల విషయంలో జరుగుతాయని తెలిసింది. పిల్లలు తరచుగా నాణేలు, బొమ్మల బ్యాటరీలు, చిన్న అయస్కాంతాలు మింగేస్తే ఎండోస్కోపీ ద్వారా వైద్యులు వాటిని తీస్తారు. అయితే 61 ఏళ్ల ఆ వృద్ధుడు ట్యాబ్లెట్‌ను కవర్‌తో సహా మింగేయడంతో పరిస్థితి ఇలా జరిగిందన్నారు. అల్యూమినియం రేకు పదునుగా ఉందని, దానిని బలవంతంగా తీస్తే, ఆహార వాహిక కోసుకు పోతుందని అన్నారు. అయితే అతడికి ప్రమాదం తప్పిందని చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: