వైఎస్‌ జగన్ సొంత బాబాయి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు పెను సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.. ఆయన తన సొంత ఇంట్లోనే దారుణంగా హత్యకు గురయ్యారు. నుదుడిపై గొడ్డలి వేటుతో రక్తపు మడుగులో ఆయన శవం కనిపించింది. అయితే.. మొదట దీన్ని గుండెపోటు అని ప్రచారం చేశారు. ఆ తర్వాత శరీరంపై గొడ్డలి వేట్లు కనిపించడంతో దీన్ని హత్యగా నిర్థారించారు. అయితే.. సంఘటనాస్థలంలో వివేకానందరెడ్డి చేతిరాతలో ఓ లేఖ కనిపించడం కలకలం రేపింది.


తనను తన డ్రైవర్ ప్రసాద్ చంపాడని.. ఆ లేఖలో రాయడం విశేషం.. ఈ లేఖ చాలా కష్టంగా రాస్తున్నానని.. డ్రైవర్ ప్రసాద్‌ను వదలొద్దు అని ఆ లేఖలో ఉంది. అయితే.. ఈ లేఖను సీబీఐ స్వాధీనం చేసుకుని విశ్లేషణకు పంపింది.. ఈ లేఖపై ఫోరెన్సిక్ విశ్లేషణ ఇప్పుడు బయటకు వచ్చింది.. ఇందులో వివరాలు చాలా సంచలనం కలిగించేలా ఉన్నాయి. వివేకా హత్య జరిగిన రోజున దొరికిన లేఖపై సీబీఐ అభిప్రాయం, ఫోరెన్సిక్‌ నివేదిక ఇప్పుడు వెలుగు చూశాయి.


లేఖ గురించి ఫోరెన్సిక్ నివేదిక ఏం చెబుతుందంటే.. ఈ లేఖను ఆయన్ని కొడుతూ, ఆయన అభీష్టానికి విరుద్ధంగా రాయించారట. తప్పనిసరి పరిస్థితులు, ఇతరుల ఒత్తిడితోనే వివేకానంద రెడ్డి తన చివరి నిమిషాల్లో ఈ లేఖ రాశారట. ఆ కారణంగానే ఆ లేఖలో వైఎస్‌ వివేకానంద రెడ్డి చేతిరాత అస్పష్టంగా, గజిబిజిగా కనిపిస్తోందట. వైఎస్‌ వివేకానంద రెడ్డి రాసినట్టుగా చెబుతున్న ఈ లేఖలోని చేతిరాతను దిల్లీలోని సెంట్రల్‌ ఫోరెన్సిక్‌ సైన్స్‌ ప్రయోగశాలకు పంపారు. అక్కడ ఫోరెన్సిక్‌ సైకలాజికల్‌ విశ్లేషణ చేయించారు. అంటే ఎలాంటి పరిస్థితుల్లో లేఖ రాశారో తెలుసుకోవడానికి ఈ విశ్లేషణ ఉపయోగపడుతుంది.


ఈ విశ్లేషణను  సీబీఐ అధికారులు  కేసు విచారణలో భాగంగా దాఖలుచేసిన అభియోగపత్రంతో పాటు కోర్టుకు అందజేశారు. ఈ నివేదిక ప్రకారం.. వైఎస్‌ వివేకానంద రెడ్డి లేఖ రాసిన సమయంలో పెన్నుకు, మెదడుకు మధ్య సమన్వయం లేదట. ఈ లేఖ వైఎస్‌ వివేకానంద రెడ్డి సొంతంగా రాసినట్లు అనిపించట్లేదట. తీవ్రమైన ఒత్తిడి, బలప్రయోగం మధ్యే లేఖ రాశారట. చేతులు వణుకుతుండగా వైఎస్‌ వివేకానంద రెడ్డి రాసినట్లు కనిపిస్తోందని.. అక్షరాలు క్రమపద్ధతిలో లేవని.. పదాలు, వరుసల మధ్య పొంతన లేదని ఆ విశ్లేషణ తెలిపింది.  

మరింత సమాచారం తెలుసుకోండి: