
ఈ యుద్ధం కారణంగా ఇప్పుడు చిన్న దేశాల్లో భయం పెరిగింది.. రష్యా వంటి పెద్ద దేశాల పక్కన ఉండే చిన్న దేశాలు ఇప్పుడు తమ భద్రతపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. అందుకే ఇప్పుడు అవి దేశ రక్షణ కోసం మరిన్ని ఆయుధాలు కొనుక్కునే అవకాశం ఉంది. దీని వల్ల ఆయుధ వ్యాపారుల పంట పండినట్టే భావించాలి. మరి ప్రపంచంలో అతి పెద్ద ఆయుధ వ్యాపారి అమెరికా అన్న సంగతి తెలిసిందే. ఈ పరిణామం వల్ల ఆయుధ వ్యాపార రంగంలో మరింత కాలం అగ్రరాజ్యంగా కొనసాగే అవకాశం ఉంటుంది.
ఈ రష్యా యుద్ధం కారణంగా ఇప్పటికే ఆయుధాలు తయారు చేసే కంపెనీల షేర్ ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. ఈ యుద్ధం వల్ల రష్యా ఆయిల్, గ్యాస్ మీద ఆధారపడకుండా యూరోపియన్ దేశాలు ప్రత్యామ్నాయాల వేట ప్రారంభిస్తాయి. దీని వల్ల కాలుష్యం లేని పవర్ జెనరేషన్ పెరుగుతుంది. అప్పటి వరకు అమెరికా తన ఆయిల్, గ్యాస్ నిక్షేపాలని ఎక్కువ ధరకు అమ్ముకుంటుంది.
అంతే కాదు.. యూరోప్ అంతటా రష్యాకు వ్యతిరేకంగా తయారు కావడంతో అవి అమెరికాతో మరింత దగ్గరవుతాయి. ఈ నేపథ్యంలో అమెరికా రాజకీయ శక్తి మరింతగా పెరుగుతుంది. ఇన్ని విధాలుగా రష్యా యుద్ధంతో అమెరికా లాభపడే అవకాశాలు ఉన్నాయి. అసలు ఈ కారణాలతోనే అమెరికా ఉక్రెయిన్‌ను రష్యాపైకి ఎగదోసిందన్న వాదనలు చేసే వారూ ఉన్నారు. ప్రపంచంలో ఎక్కడో ఓ చోట యుద్ధం జరగాలని కోరుకునే అమెరికా.. ఇప్పుడు రష్యా యుద్ధంతో మరింత ఆనందపడుతుందన్నది అమెరికా వ్యతిరేక శక్తుల వాదన.