రాజకీయాల్లో చేసింది చెప్పుకోవడంలో తప్పు లేదు.. కానీ.. పదే పదే సొంత డబ్బా కొట్టుకోవడం కూడా ఆ నాయకులకు శోభనివ్వదు. కానీ.. చంద్రబాబు మాత్రం ఈ విషయం పట్టించుకోరు. ఎక్కడ అవకాశం వచ్చినా.. ఏమాత్రం సందర్భం కలిసొచ్చినా.. తన ఘనత తానే డప్పుకొట్టుకుంటారు. నేనే చేశా.. నేనే చేశా.. అని చెప్పుకోవడం ఆయనకు మైనస్ పాయింట్.. కానీ ఆయన మాత్రం అదేం పట్టించుకోరు. జనం ఎక్కడ తన ఘనత మరిచిపోతారో అని అనుకుంటారో ఏమో కానీ.. ఆయన మాత్రం సొంత డబ్బా ఆపరు.


తాజాగా ఆయన మరోసారి తన సొంతడబ్బా వినిపించారు. ముఖ్యమంత్రిగా మొదటిసారి ప్రమాణ స్వీకారం చేసి నిన్నటికి సరిగ్గా 27 ఏళ్ల పూర్తయింది. ఈ సందర్భంగా ఆనాటి జ్ఞాపకాలను చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. 1995 సెప్టెంబర్ 1 తర్వాత ముఖ్యమంత్రిగా దాదాపు 14 ఏళ్లు పని చేసిన ప్రస్థానంలో ఎన్నో మైలురాళ్ళు,  మరెన్నో కీలక మలుపులు ఉన్నాయని చంద్రబాబు అంటున్నారు. ప్రజల్లో ప్రశ్నించే తత్వాన్ని పెంచటంతో పాటు జన్మభూమి వంటి కార్యక్రమాల్లో ప్రజలు కూడా పాలనలో భాగస్వాములయ్యారని చంద్రబాబు గుర్తు చేసుచేశారు. తాను రూపొందించిన 'విజన్-2020' అనే విజన్ డాక్యుమెంట్ ను అప్పట్లో ఎగతాళి చేసినవారే, ఆ తర్వాత ఆ విజన్ డాక్యుమెంట్ ఫలితాలను ప్రత్యక్షంగా చూస్తున్నారని చంద్రబాబు అంటున్నారు.


మైక్రోసాఫ్ట్ వంటి సంస్థలను ఆంధ్రప్రదేశ్ కు తీసుకువచ్చి, ప్రపంచ ఐటీ రంగం దృష్టి రాష్ట్రంపై పడేలా చేశానని.. తన వల్లే లక్షలాది ఐటీ ఉద్యోగాలు వచ్చాయని చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. ఐటీ ఉద్యోగాలకు నిపుణులను సిద్ధం చేసేందుకు పెద్ద ఎత్తున ఇంజనీరింగ్ కాలేజీలను అందుబాటులోకి తెచ్చానని చెప్పారు. ప్రస్తుతం అమెరికాలో ఎక్కువ ఆదాయం పొందుతున్న భారతీయుల్లో 30 శాతం మంది తెలుగువారే అన్నమాట విన్నప్పుడు... తనకెంతో తృప్తినిస్తోందని చంద్రబాబు అంటున్నారు.


ఏపీకి వచ్చే సంస్థల కోసం మౌలిక రంగ అభివృద్ధి చేసి  ఉత్తమ విధానాలు తీసుకొచ్చానని.. అందుకు ఉదాహరణ సైబరాబాద్ నగర నిర్మాణమని చంద్రబాబు గుర్తు చేశారు. ఇప్పుడు సైబరాబాద్ దేశ విదేశాల్లోని అనేక సంస్థలకు కీలక వేదికగా నిలిచిందని చంద్రబాబు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: