ఏపీలో కొత్త ట్రాఫిక్‌ రూల్స్ అమల్లోకి వస్తున్నాయి. ప్రత్యేకించి విశాఖలో అక్టోబర్ 20 నుంచి ద్విచక్ర వాహనాల పై వెనుక కూర్చొన్న వ్యక్తికి కూడా హెల్మెట్ తప్పనిసరి చేస్తున్నట్లు విశాఖ ఉప రవాణా కమిషనర్ రాజరత్నం చెబుతున్నారు. ఇక పై ద్విచక్రవాహనం నడిపిన వ్యక్తితో పాటుగా వెనుక కూర్చున్న వ్యక్తి కూడా హెల్మెట్ ధరించాల్సిందేనన్నారు. అక్టోబర్ 20 వ తేదీ నుండి విశాఖ నగరంలో ఈ నిబంధన అమలు చేయడం జరుగుతుందని విశాఖ ఉప రవాణా కమిషనర్ రాజరత్నం తెలిపారు. ఇటీవల జరిగిన జిల్లా రహదారి భద్రతా కమిటీ సమావేశములో ద్విచక్ర వాహనం నడిపిన వ్యక్తితో పాటుగా వెనుక కూర్చున్న వ్యక్తికి కూడా హెల్మెట్ నిబంధన తప్పనిసరిగా అమలు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు జిల్లా రహదారి భద్రతా చైర్మన్ మరియు జిల్లా కలెక్టర్.. పోలీసు, రవాణా శాఖలకు ఆదేశాలను జారీ చేశారు.


మోటారు వాహనాల చట్టం 1988 సెక్షన్ 129 ప్రకారం ద్విచక్ర వాహనం నడిపే వారితో పాటుగా వెనుక కూర్చున్న వ్యక్తి కూడా తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని నిబంధన ఇప్పటికే ఉంది. ఇప్పటి వరకు దీనిని అమలు చేయలేదు. ఈ ఏడాది జనవరి నుండి ఆగష్టు వరకు జరిగిన ప్రమాదాలలో 70 మంది పైగా ద్విచక్రవాహనదారులు ప్రాణాలను కోల్పోయారు. అందుకే  ప్రాణ నష్టం నివారించే దిశగా జిల్లా కలెక్టర్ ఈ ఆదేశాలు జారీ చేయడం జరిగింది.


అక్టోబర్ 20 నుంచి రవాణా మరియు పోలీసు శాఖల ఆధ్వర్యంలో ప్రత్యేక తనిఖీలు నిర్వహించి నిబంధనలను ఉల్లంఘించిన వారికి కేసు నమోదు చేస్తారు. ఉల్లంఘించిన వారికి రూ.1000 లు జరిమానా విధిస్తారు. ఈ ఏడాది ఇప్పటికే  హెల్మెట్ ధరించకుండా ప్రయాణిస్తున్న 1243 ద్విచక్రవాహనదారులపై కేసులు నమోదు చేశారు. వీరి నుంచి రూ.12,43,000 లు జరిమానా విధించడం జరిగింది. అందుకే ద్విచక్రవాహనదారులు, తమ భద్రత కొరకు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి. ఇలా చేస్తే రోడ్డు ప్రమాదాల నివారణకు సహకరించిన వారు అవుతారని విశాఖ జిల్లా ఉప రవాణా కమీషనర్ రాజారత్నం తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: