ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబునాయుడు వైఖరే చాలా విచిత్రంగా ఉంది. తిరుపతి లోక్ సభ ఉపఎన్నికల్లో పార్టీ అభ్యర్ధి పనబాక లక్ష్మికి ప్రచారం చేయవయ్యా బాబూ అంటే ఎన్నికల్లో ఎలాంటి సంబంధంలేని పవన్ కల్యాణ్ కు ప్రచారం చేస్తున్నాడు. తమ అభ్యర్ధిని వదిలిపెట్టి వెళ్ళిన ప్రతిచోటా పనిలోపనిగా పవన్ గురించి కూడా చంద్రబాబు మాట్లాడుతుండటమే చాలా విచిత్రంగా ఉంది. ఇంతకీ విషయం ఏమిటయ్యా అంటే వకీల్ సాబ్ సినిమా ప్రీమియర్ షోలకు ప్రభుత్వం అడ్డుకున్నదట. ప్రీమియర్ షోలకు ప్రభుత్వం అనుమతిస్తే లాభపడేది ఎగ్జిబిటర్లు, థియోటర్ల ఓనర్లు మాత్రమే. అదే అనుమతి నిరాకరిస్తే సినిమా చూసేవాళ్ళు ఫుల్లు హ్యాపీస్.




మామూలుగా పెద్ద హీరోలు నటించిన సినిమాలు విడుదల సందర్భంగా టికెట్ల ధరలు పెంచుకునే విషయంలో ఎగ్జిబిటర్లు ప్రభుత్వాన్ని రిక్వెస్టు చేసుకుంటారు. దానికి ప్రభుత్వం సానుకూలంగా స్పందించటం మామూలుగా జరిగేదే. అలాగే ఇపుడు వీకల్ సాబ్ సినిమా సందర్భంగా కూడా ఎగ్జిబిటర్లు ప్రభుత్వాన్ని రిక్వెస్టు చేశారు. అయితే ప్రభుత్వం అనుమతించకుండానే ప్రీమియర్ షోల పేరుతో ఎగ్జిబిటర్లు టికెట్ల ధరలను తమిష్టం వచ్చినట్లుగా పెంచి అమ్మేశారు. అయితే వాళ్ళు ఊహించని రీతిలో ప్రభుత్వం ప్రీమియర్ షోలకు నిరాకరించింది. దాంతో ప్రభుత్వం-ఎగ్జిబిటర్ల మధ్య వివాదం మొదలైంది. ఎగ్జిబిటర్లు కోర్టుకు వెళితే సింగిల్ బెంచ్ అనుకూలంగా తీర్పిచ్చింది. అయితే ప్రభుత్వం డివిజన్ బెంచ్ కు వెళినపుడు ప్రభుత్వ నిర్ణయమే ఫైనల్ అని తేల్చేసింది.




హోలు మొత్తంమీద చూస్తే విషయంలో పవన్ ఎక్కడా మాట్లాడలేదు. సినిమా చూసేవాళ్ళు కూడా ఫుల్లుగా హ్యాపీనే. మరి ఏమీ సంబంధంలేని చంద్రబాబు పదే పదే వకీల్ సాబ్ కు వత్తాసుగా ఎందుకు మాట్లాడుతున్నారో అర్ధం కావటంలేదు. పవన్ మీద జగన్మోహన్ రెడ్డి కక్షసాధింపులకు దిగినట్లు ఆరోపణలు చేస్తున్నారు. తన సినిమాకు ఇబ్బందులు వచ్చిందని అనుకుంటే పవన్ మాట్లాడాలి కానీ మధ్యలో చంద్రబాబు ఎందుకు గోల చేస్తున్నారో  అర్ధం కావటంలేదు. తాను అధికారంలో ఉన్నపుడు రాణిరుద్రమ సినిమాకు వినోదపు పన్ను మినహాయింపు ఇవ్వమని డైరెక్టర్ ఎన్నిసార్లు అడిగినా చంద్రబాబు అంగీకరించలేదు. రామ్ గోపాలవర్మ తీసిన కమ్మరాజ్యంలో కడపరెడ్డి సినిమా రిలీజ్ కు చంద్రబాబు ప్రభుత్వం అనుమతించలేదు. వర్మ సినిమాను చంద్రబాబు ప్రభుత్వం అడ్డుకున్నట్లుగా వకీల్ సాబ్ సినిమాను జగన్ ప్రభుత్వం అడ్డుకోలేదు. కక్షసాధింపంటే చంద్రబాబు ప్రభుత్వానిదా ? లేకపోతే జగన్ ప్రభుత్వానిదా ?

మరింత సమాచారం తెలుసుకోండి: