
అవును రెండేళ్ళక్రితం జగన్మోహన్ రెడ్డి ఆ తప్పు చేయకుండా ఉండుంటే ఇపుడు హ్యాపీగా ఉండేవారేమో. కానీ అప్పట్లో ఆ తప్పు చేయకతప్పలేదు. దాని ఫలితాన్ని జగన్ ఇపుడు అనుభవిస్తున్నారు. ఇంతకీ జగన్ చేసిన తప్పేమిటో తెలుసా ? 2019 ఎన్నికల్లో వైసీపీ తరపున నరసాపురం ఎంపిగా పోటీచేయటానికి రఘురామ కృష్ణంరాజుకు టికెట్ ఇవ్వటమే. అవును అప్పట్లో కృష్ణంరాజును పార్టీలోకి చేర్చుకోకుండా ఉండుంటే సరిపోయేది. అప్పుడు టికెట్ ఇవ్వకుండా ఉండుంటే ఇపుడీ సమస్యే ఉత్పన్నమయ్యేదికాదు. అప్పటి ఎన్నికల్లో తెలుగుదేశంపార్టీ తరపున టికెట్ ఖాయం అయిన తర్వాతే ఉన్నట్లుంది టీడీపీకి రాజీనామా చేసి కృష్ణంరాజు వైసీపీలో చేరారు. చివరినిముషంలో టికెట్ తెచ్చుకుని గెలిచారు. తర్వాత నుండి ఎంత కంపు చేస్తున్నది అందరు చూస్తున్నదే.
నిజానికి కృష్ణంరాజుకు టికెట్ జగన్ కు ఏమాత్రం ఇష్టంలేదట. కానీ అప్పట్లో నరసాపురం లోక్ సభ పరిధిలో పోటీచేసిన అభ్యర్ధులు+పార్టీలో కీలక నేతల ఒత్తిడి కారణంగానే అయిష్టాంగానే అయినా జగన్ టికెట్ ఇవ్వకతప్పలేదని పార్టీ వర్గాల సమాచారం. అంత గాలిలో కూడా కృష్ణంరాజుకు వచ్చింది కేవలం 30 వేల మెజారిటి మాత్రమే. అప్పట్లో వైసీపీ తరపున గెలిచిన 22 మంది ఎంపిల్లో చాలామంది మంచి మెజారిటిలతో గెలిస్తే అతి తక్కువ మెజారిటితో గెలిచింది ఒక్క కృష్ణంరాజు మాత్రమే. తాను పోటీ చేయబట్టే వైసీపీ నరసాపురంలో గెలిచిందని కృష్ణంరాజంటారు. కృష్ణంరాజు అభ్యర్ధి కాకుండా ఇంకెవరైనా అయ్యుంటే ఇంకా కంఫర్టబుల్ మెజారిటితో గెలిచేవారని ఎంఎల్ఏలు, పార్టీ నేతలు ఎదురుదాడి చేస్తున్నారు.
సరే ఈ విషయాలన్నింటినీ పక్కనపెట్టేస్తే గెలిచిన వెంటనే జగన్ కు దూరమైపోయారు. దూరమైపోయిన దగ్గర నుండి సొంతపార్టీపైనే, ప్రభుత్వంపైనా, స్వయంగా జగన్ పైనా నోటికొచ్చినట్లు మాట్లాడటం మొదలుపెట్టారు. చివరకు జగన్ను వ్యక్తిగతంగా టార్గెట్ చేశారు. జగన్ బెయిల్ రద్దు చేయాలని, వైఎస్సార్సీపీ అసలు జగన్ దే కాదని, జగన్ మానసిక పరిస్ధితి సరిగాలేదంటు నోటికొచ్చినట్లు మాట్లాడారు. ప్రభుత్వ పథకాల్లో లోపాలను కృష్ణంరాజు ఎంతగా విమర్శిస్తున్నా ప్రభుత్వం ఏనాడూ పట్టించుకోలేదు. అయితే డైరెక్టుగా సీఎంను పట్టుకుని జగన్ అసలు రెడ్డేకాదని, జగన్ పిచ్చోడని, ఇంగ్లాండులో చికిత్స చేయించుకుంటున్నాడంటు ఆరోపణలు చేసేసరికి మండిపోయింది. దాంతో రాజు పాపం కూడా పండింది. సరే ఇపుడు విషయం కోర్టుకు చేరింది కాబట్టి ఏమవుతుందో చూడాల్సిందే.