
జగన్మోహన్ రెడ్డిపై అనివార్యంగా ఇపుడు ఒత్తిడి పెరిగిపోతోంది. తెలంగాణా సీఎం కేసీయార్ గాంధీ ఆసుపత్రిని సందర్శించిన విషయం తెలిసిందే. ఆసుపత్రిలోని కరోనా వైరస్ రోగులకు కేటాయించిన ఏడు వార్డుల్లో తిరిగి రోగులతో ముచ్చటించిన విషయమూ తెలిసిందే. ఎప్పుడైతే కేసీయార్ ఆసుపత్రిలో కరోనా రోగుల మధ్య గంటపాటు గడిపారో అప్పటి నుండే జగన్ పైన కూడా ఒత్తిడి మొదలైపోయింది. ఎందుకంటే ఎప్పుడో కానీ జనాల్లోకి రాని కేసీయారే కరోనా వైరస్ రోగుల మధ్య తిరిగినపుడు జగన్ మాత్రం అదే పనిని ఎందుకు చేయకూడదు ? అనే చర్చ మొదలైంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే కేసీయార్ తిరిగినా, జగన్ తిరగకపోయినా కరోనా రోగులకు ఒకటే. కాకపోతే స్వయంగా ముఖ్యమంత్రే వచ్చి తమను పరామర్శించారంటే కరోనా వైరస్ రోగుల్లో ఎంతటి ఆత్మస్ధైర్యం పెరుగుతుంది ?
కేసీయార్ గాంధీ ఆసుపత్రిలో ఇపుడు చేసిందిదే. కేసీయార్ కూడా కరోనా వైరస్ పీడితుడే కాబట్టి కరోనా సోకితే రోగి పరిస్దితి ఎలాగుంటుందో ప్రత్యేకించి ఎవరు చెప్పనక్కర్లేదు. అందుకనే తనకు నెగిటివ్ రిపోర్టు వచ్చిన కొద్ది రోజుల తర్వాత స్వయంగా గాంధీ ఆసుపత్రిలోని కరోనా రోగుల వార్డును సందర్శించారు. నిజంగా ఇది గొప్ప విషయమనే చెప్పాలి. మరంతటి గొప్పపనిని కేసీయారే చేసినపుడు జగన్ మాత్రం ఎందుకు చేయకూడదు ? కరోనా వైరస్ నియంత్రణలో అధికారయంత్రాంగం బాగానే కష్టపడుతోంది. మంత్రులు, ప్రజాప్రతినిధులు కూడా తమవంతుగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. కానీ వీళ్లందరు చేసేదొకటి జగన్ ఒక్కళ్ళు చేసేదొకటి. అందుకనే స్వయంగా జగన్ కూడా అన్నీ జాగ్రత్తలు తీసుకుని వారంలో కనీసం ఓ మూడు ఆసుపత్రులను సందర్శిస్తే బాగుంటుంది.
ఎలాగూ జగన్ కరోనా టీకా రెండు డోసులు వేయించేసుకునే ఉంటారు. కాబట్టి కరోనా వైరస్ సోకితే ప్రమాధమనే భయం కూడా అవసరంలేదు. పీపీఈ కిట్లు ధరించి రెగ్యులర్ గా ఆసుపత్రులను ఆకస్మికంగా తినిఖీలు చేసినట్లు చేసి రోగులను పరామర్శిస్తే వాళ్ళకు బూస్టప్ గా ఉంటుంది. పనిలో పనిగా ఏ ఆసుపత్రికి జగన్ వస్తారో తెలీదు కాబట్టి ఆసుపత్రుల అధికారులందరు అప్రమత్తంగా ఉంటారు. దానివల్ల ఆసుపత్రుల్లో పరిస్ధితులు కూడా మెరుగుపడతాయనటంలో సందేహంలేదు. కరోనా వైరస్ బాగా స్పీడుగా వ్యాపించేస్తోందన్నది వాస్తవమే. కానీ దానికి తగ్గట్లుగానే అన్నీ జాగ్రత్తలు తీసుకుని జగన్ గనుక ఆసుపత్రులను ఆకస్మికంగా తనిఖీ చేస్తే బాగుంటుందని జనాలు కూడా అనుకుంటున్నారు. మరి జగన్ తాడేపల్లిని వదిలి ఆసుపత్రులను సందర్శిస్తారా ?