మ‌త‌మౌఢ్యం వెర్రి త‌ల‌లు వేస్తే ప్ర‌జ‌లు ఎంత‌టి క‌డ‌గండ్లకు లోన‌వుతారో తెలుసుకునేందుకు ప్ర‌త్య‌క్ష‌సాక్ష్యంగా నిలుస్తుంది నేటి ఆప్ఘ‌నిస్తాన్. కొద్ది నెల‌ల క్రితం తిరిగి తాలిబ‌న్ల క‌బంధ హ‌స్తాల్లో చిక్కిన ఈ దేశంలో ప్ర‌స్తుతం సామాన్య ప్ర‌జ‌లు ఎదుర్కొంటున్న దుర్భ‌ర ప‌రిస్థితులు, బ‌య‌ట‌కు వ‌స్తున్న అక్క‌డి హృద‌య విదార‌క దృశ్యాలు మాన‌వ‌త్వం ఉన్న ఎవ‌రినైనా కదిలిస్తాయి. క‌నీస అవ‌స‌రాలైన ఆహారం, వైద్యం వంటివి అంద‌క అక్క‌డి ప్ర‌జ‌లు అల‌మ‌టిస్తున్న ప‌రిస్థితులు కంట‌త‌డి పెట్టిస్తాయి. అస‌లు ఎందుకు ఆ దేశంలో క‌నీస మాన‌వ హ‌క్కులు సైతం మృగ్య‌మ‌య్యాయి..? మ‌త‌మౌఢ్యం మూర్తీభ‌వించిన తాలిబ‌న్లకు ఒక దేశ సైన్యాన్ని ఎదిరించి ఓడించి మ‌రీ ఆ దేశంలో అధికారాన్ని కైవ‌సం చేసుకునేంత బ‌లం ఎలా వ‌చ్చింది..? ఉగ్ర‌వాద మూక‌ల‌కు పెట్ట‌నికోట‌గా మారిన ఈ దేశాన్నేత‌న కార్య‌క‌లాపాల‌కు కేంద్రంగా చేసుకుని ఆల్‌ఖైదా అధినేత బిన్ లాడెన్‌ ఏకంగా అగ్ర‌రాజ్యం అమెరికా మీద‌నే దాడుల‌కు తెగ‌బ‌డ‌టానికి అత‌డికి వెన్నుద‌న్నుగా నిలిచిందెవ‌రు..?  ప‌క్క‌లో బాంబులా మ‌న పొరుగున ఉన్న దేశంలోని ప్ర‌మాద‌క‌ర ప‌రిస్థితులు మ‌న దేశానికి ఏ ర‌క‌మైన ఇబ్బందులు క‌లిగించ‌నున్నాయ‌నే అంశాలు త‌ప్ప‌క తెలుసుకోవాల్సిందే.
 
         చారిత్ర‌కంగా చూస్తే ఒక‌ప్ప‌టి గాంధార దేశ‌మే నేటి ఆప్ఘ‌నిస్తాన్‌. మ‌ధ్య ఆసియా నుంచి దండెత్తివ‌చ్చిన ముస్లిములు ఆక్ర‌మించుకోక‌ముందు ఈ దేశం అఖండ భార‌త్‌లోని భాగ‌మే.  ఇక ఆధునిక కాలానికి వ‌స్తే ప్ర‌పంచ రాజ‌కీయాలకు, అగ్ర‌రాజ్యాల ఆధిప‌త్య పోరుకు ఆప్ఘ‌నిస్తాన్ కేంద్రం కావ‌డానికి ప్ర‌ధాన కార‌ణం ఈ దేశానికి భౌగోళికంగా ఉన్న ప్రాధాన్య‌మే. మ‌ధ్య‌, దక్షిణాసియాల కూడ‌లిలో ఉన్న ఈ దేశం తూర్పున, ద‌క్షిణాన‌ పాకిస్తాన్‌, ప‌శ్చిమాన ఇరాన్‌, ఉత్త‌రాన తుర్క్‌మెనిస్తాన్‌, ఉజ్బెకిస్తాన్‌, త‌జికిస్తాన్‌, ఈశాన్య భాగంలో చైనా దేశాల‌ను స‌రిహ‌ద్దులుగా క‌లిగి ఉంది. ఉత్త‌రాదిన ఉన్న ప్రాంతాలు ఒక‌ప్ప‌టి సోవియ‌ట్ యూనియ‌న్ ప‌రిధిలోనివి. వీటికి చైనాతోనూ స‌రిహ‌ద్దు ఉంది. ఈ కార‌ణంగానే అమెరికా- ర‌ష్యాల మ‌ధ్య‌ ప్ర‌చ్ఛ‌న్న‌యుద్ధ కాలంలో అటు ర‌ష్యా ఇటు అమెరికాల‌కు ఈ దేశం చాలా కీల‌కంగా మారిపోయింది. అప్ప‌ట్లో అక్క‌డి ప్ర‌భుత్వానికి ర‌ష్యా ఆర్థికంగా, సైనికంగా స‌హ‌క‌రిస్తూ త‌న ప్రాబ‌ల్యంలో ఉంచుకునే ప్ర‌య‌త్నాలు చేసింది. ఇక అమెరికా, చైనా, పాకిస్తాన్ ఒక కూట‌మిగా ఉంటూ ర‌ష్యాకు, ఆప్ఘ‌న్ ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా అక్క‌డ ఉగ్ర‌వాదాన్నిప్రోత్స‌హిస్తూ వ‌చ్చాయి. వారికి ఆయుధాల‌ను అందించాయి. ఈ కుటిల రాజ‌కీయాలే అక్క‌డ ఉగ్ర‌వాద భూతం ఆవిర్భావానికి బీజం వేశాయి. సోవియ‌ట్ యూనియ‌న్ విచ్ఛిన్నం త‌రువాత ఆ దేశం ఆప్ఘ‌నిస్తాన్ నుంచి వైదొలిగింది. ఆ తర్వాత అక్క‌డ ఏర్ప‌డిన ప్ర‌భుత్వానికి కొన్నాళ్లు అమెరికా ప్ర‌భుత్వం మ‌ద్ద‌తుగా నిలిచినా ఆప్ఘ‌న్‌కు దౌత్య ప‌రంగా ప్రాధాన్యం త‌గ్గించింది. ఇదే స‌మ‌యంలో అక్క‌డ ఇస్లామిక్ ఉగ్ర‌వాదం బ‌ల‌ప‌డింది. ఆల్‌ఖైదాకు స్థావ‌రంగా మారిపోయింది. ఆ సంస్థ అధినేత ఉగ్ర‌వాదానికి వ్య‌తిరేకంగా అమెరికా తీసుకున్న చ‌ర్య‌ల‌ను నిర‌స‌న‌గా హైజాక్ చేసిన విమానాల‌తో ఏకంగా అమెరికాపైనే దాడికి చేసింది. దీంతో ఆప్ఘ‌న్ పై యుద్ధం ప్ర‌క‌టించిన అగ్ర‌దేశం ఆ దేశంపై తీవ్ర దాడుల‌కు దిగ‌డంతోపాటు, ఆ సంస్థ అధినేత బిన్‌లాడెన్‌ను వెంటాడి వేటాడింది. ఆ త‌ర్వాత అక్క‌డ ప్ర‌జాస్వామ్య ప్ర‌భుత్వం ఏర్పాటు చేసి ఆర్థిక, సైనిక సాయంతోపాటు కొంత సైన్యాన్నికూడా ఉంచింది. అయితే మారిన ప‌రిస్థితుల్లో అమెరికాకు శత్రువులుగా మారిన చైనా, పాక్‌లు అక్క‌డి ఉగ్ర‌వాదుల‌కు ప‌రోక్షంగా స‌హ‌క‌రిస్తూ రావ‌డం, ఈ వ్య‌వ‌హారం త‌న‌కు పెనుభారంగా మారడంతో అమెరికా తన సైన్యాన్ని ఉప‌సంహ‌రించుకోవ‌డంతో ఆప్ఘ‌న్ మ‌రోసారి ఇస్లామిక్ తీవ్ర‌వాదుల చేతుల్లోకి వెళ్లిపోయింది. ఇక స‌మీప భ‌విష్య‌త్తులో అక్క‌డి ప‌రిస్థితులు మారే అవ‌కాశం క‌నిపించ‌డం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: