కాంగ్రెస్ పదేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చింది. నేతలంతా ఉత్సాహంగా ఉన్నారు. అయితే ముందుంది ముసళ్ల పండుగ అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఎందుకంటే ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలి కాబట్టి. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు హామీల అమలకు 100 రోజుల సమయం పడుతుందని ఆ పార్టీ సీనియర్ నాయకులు పేర్కొన్నారు. వంద రోజుల సమయం తీసుకున్నా ఇచ్చిన హామీలను అమలు చేస్తారా అనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది.


ఎందుకంటే ఖజానా చూస్తే అంత ఆశాజనకంగా ఏమీ లేదు. మిగులు బడ్జెట్ తో ఏర్పడిన తెలంగాణ ప్రస్తుతం అప్పుల కుప్పలో మునిగిపోయింది. ఒకవేళ బీఆర్ఎస్ సర్కారు వచ్చినా దాదాపు ఆపార్టీ ఇచ్చిన హామీలకు ఇదే పరిస్థితి తలెత్తేది. ప్రస్తుతం కాంగ్రెస్ అధికారం చేజిక్కించుకుంది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్న రేవంత్ రెడ్డి ముందు పెను సవాళ్లు ఉన్నాయి.


ఎందుకంటే ఇచ్చిన హామీలు చాలానే ఉన్నాయి. ముందు ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని.. తొలి మంత్రి వర్గ సమావేశంలోనే ఆమోదిస్తామని కాంగ్రెస్ నేతలు చెప్పి అధికారంలోకి వచ్చారు. వీటిలో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, రూ.500కే గ్యాస్ సిలిండర్, రైతులకు, కౌలు రైతులకు రైతు భరోసా, 200 యూనిట్ల వరకు కరెంట్ విద్యుత్తు ఛార్జీలు మినహాయింపు వంటివి ముఖ్యంగా ఉన్నాయి. ఇవన్నీ ఖజానాపై పెను భారం చూపేవి. ఏ ఒక్క దాంట్లో వెనకడుగు వేసినా..కాంగ్రెస్ సర్కారు తొలినాళ్లలోనే నవ్వుల పాలవుతుంది.


అందుకే ఆర్థిక మంత్రితో పాటు అధికారులు కూడా దీనిపై పూర్తి స్థాయిలో కసరత్తులు చేయాల్సి ఉంది. ఇక్కడ మరో విషయం ఏమిటంటే హామీల అమలుకు పన్నులు పెంచితే మాత్రం మళ్లీ ప్రభుత్వంపై విమర్శలు తలెత్తే అవకాశం ఉంది. కర్ణాటక మోడల్ చెబుతూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ కన్నడ నాట ఉచిత విద్యుత్తు ఇచ్చేందుకు మిగిలిన వారిపై విద్యుత్తు భారాన్ని మోపారు. నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ వంటి అంశాలపై దృష్టి సారించాల్సి ఉంది. దీంతో పాటు హామీల అమలుకు నిధులు ఎక్కడి నుంచి తీసుకువస్తారు.. అప్పుల మీద ఆధారపడతారా.. లేక ఇతర ఆదాయ మార్గాలను అన్వేషిస్తారా అనేది తేలాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: