తెలంగాణ రాజకీయ వాతావరణాన్ని కుదిపేస్తున్న జూబ్లీహిల్స్ ఉపఎన్నికల పోరాటం ఇప్పుడు అన్ని పార్టీల ప్రతిష్టను నిలబెట్టే స్థాయికి చేరింది. ఈ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ తలో విధంగా వ్యూహాలు రచిస్తున్నాయి. అయితే ప్రచార పరంగా చూస్తే కాంగ్రెస్, బీఆర్ఎస్ మాత్రమే యాక్టివ్‌గా కనిపిస్తున్నాయి. బీజేపీ మాత్రం చీకట్లో కత్తి యుద్ధం చేస్తున్నట్టుగా, చాలా మౌనంగా వ్యవహరిస్తోంది. బీజేపీ ఎత్తుగ‌డ‌ల‌పై తెలంగాణ రాజ‌కీయ వ‌ర్గాల్లో ర‌క‌ర‌కాల ప్ర‌చారాలు జ‌రుగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ నుంచి నవీన్ యాదవ్ బరిలో ఉంటే, బీఆర్ఎస్ తరఫున మాగంటి సునీత రంగంలోకి దిగుతున్నారు. బీజేపీ మాత్రం లంకల దీపక్ రెడ్డిని రంగంలోకి దింపి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతోంది. అయితే ప్రచారంలో బీజేపీ కనీసం కనిపించకపోవడం, పార్టీ కార్యకర్తల్లో కూడా కన్ఫ్యూజన్ సృష్టిస్తోంది. బీజేపీ నిజంగా అధికారాన్ని లక్ష్యంగా పెట్టుకుందా, లేక ఇతర పార్టీలకు సహకరించే పథకం ఉందా అనే అనుమానాలు చెలరేగుతున్నాయి.


ఇక కాంగ్రెస్ - బీఆర్ఎస్ ల మధ్య విమర్శల యుద్ధం చెలరేగుతోంది. కాంగ్రెస్, బీజేపీ బీఆర్ఎస్‌తో కుమ్మక్కైందని ఆరోపిస్తుండగా, బీఆర్ఎస్ మాత్రం టి బీజేపీ పెద్దలు తెర వెనుక కాంగ్రెస్‌కు సహాయం చేస్తున్నారని ప్రతిదాడి చేస్తోంది. ఈ ఆరోపణల వెనుక రాజకీయ లెక్కలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఏపీలో టీడీపీ - జనసేనలతో చేతులు కలిపిన బీజేపీ, తెలంగాణలో మాత్రం ఆ పొత్తుకి ‘నో’ చెప్పడం విశేషం. అంటే తెలంగాణలో బీజేపీ తన సొంత శక్తిపై ఎదగాలనే ఆలోచనలో ఉందా, లేక వేరొక రాజకీయ సమీకరణను దృష్టిలో పెట్టుకుందా అన్నది ఇప్పుడు హాట్ టాపిక్.


తెలుగు రాష్ట్రాల్లో బీజేపీకి పెద్దగా బలం లేకపోవడం తెలిసిందే. ఎన్నేళ్లుగా ప్రయత్నాలు చేసినా పార్టీ రెండవ స్థానానికైనా చేరుకోలేకపోయింది. అలాంటప్పుడు ఒంటరిగా అధికారంలోకి రావడం దాదాపు అసాధ్యమేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బీజేపీ వ్యూహం మాత్రం ఆసక్తికరంగా ఉంది. దీపక్ రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో, బీజేపీ అభ్యర్థిని ఎంపికచేయడం వెనుక కాంగ్రెస్ ఓటు బ్యాంక్‌ను చీల్చడమే లక్ష్యమా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.


ఇలా చూస్తే, జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో బీజేపీ నడుస్తున్న దారిలో స్పష్టత కనిపించడం లేదు. పార్టీ టార్గెట్ నిజంగా అధికారమా, లేక భవిష్యత్తు కూటములకు దారితీసే సహకారమా అన్నది నవంబర్ 14న‌ ఓటింగ్ తర్వాతే స్పష్టమవుతుంది. కానీ ఈ ఎన్నికతో తెలంగాణలో బీజేపీ రాజకీయ దిశ ఏ వైపుకు వెళ్తుందో నిర్ణయమవుతుందనే అభిప్రాయం బలంగా వినిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: