తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ హైదరాబాద్‌ను ప్రపంచ దృష్టి కేంద్రంగా మార్చింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత రెండేళ్లుగా కలలు కంటున్న భారీ కార్యక్రమం ఇప్పుడు రియాలిటీగా మారి నిలుస్తోంది. ప్రపంచ దిగ్గజ కంపెనీల అధినేతలు, విదేశీ రాయబారులు, నోబెల్ బహుమతి గ్రహీతలు, టాప్ టెక్ సీఈవోలు ఒకే వేదికపై కనిపించడం సాధారణ సంఘటన కాదు. రేవంత్ ఈ రెండు రోజుల్లో వందలాది మంది పెట్టుబడిదారులతో నేరుగా మాట్లాడి రాష్ట్ర అవకాశాలను వివరిస్తారు. ఫలితంగా లక్షల్లో కాకుండా లక్షల కోట్ల రూపాయల పెట్టుబడి ఒప్పందాలు కుదిరే అవకాశం కనిపిస్తోంది.

ఈ సమ్మిట్‌లో అమెజాన్, గూగుల్, మైక్రోసాఫ్ట్, టాటా, అదానీ, రిలయన్స్ వంటి దిగ్గజ సంస్థలు పెద్ద ఎత్తున హాజరుకానున్నాయి. డేటా సెంటర్లు, సెమీకండక్టర్ యూనిట్లు, ఏరోస్పేస్, డిఫెన్స్, ఫార్మా, లైఫ్ సైన్సెస్ రంగాల్లో భారీ ప్రాజెక్టులు రాష్ట్రానికి దక్కే అవకాశం ఉంది. ఇప్పటివరకు వచ్చిన సమాచారం ప్రకారం మూడు లక్షల కోట్ల రూపాయలకు పైగా ఒప్పందాలు సంతకాలు అవుతున్నాయి. ఇవి అమలైతే తెలసరి ఆదాయం పెంపు, ఉద్యోగ అవకాశాలు, పారిశ్రామిక వృద్ధి ఒకేసారి జోరుగా సాగే అవకాసం ఏర్పడుతుంది.

రేవంత్ రెడ్డి ఈ సమ్మిట్‌ను కేవలం పెట్టుబడుల మేళాగా మాత్రమే చూడటం లేదు. తెలంగాణను 2047 నాటికి అగ్రగామి రాష్ట్రంగా మార్చే దీర్ఘకాలిక బ్లూ ప్రింట్‌ రెడీ చేశారు. రతన్ టాటా రోడ్, ట్రంప్ ఎవెన్యూ, గూగుల్ స్ట్రీట్ వంటి పేర్లతో హైదరాబాద్‌ను గ్లోబల్ బ్రాండ్‌గా నిలపాలనే ఆలోచన కూడా ఇక్కడే మొదలైంది. ప్రపంచం మొత్తం ఇప్పుడు తెలంగాణ వైపు చూస్తోందనే విశ్వాసం రేవంత్‌లో స్పష్టంగా కనిపిస్తోంది.

అయితే ఈ డ్రీమ్ నిజమవుతుందా అనేది రానున్న రోజుల్లోనే తేలనుంది. గతంలో ఇలాంటి సమ్మిట్లలో ఒప్పందాలు కుదిరినా అమలు శాతం తక్కువగా ఉండేది. రేవంత్ ప్రభుత్వం ఈసారి ప్రతి ఒప్పందానికి టైమ్‌లైన్ పెట్టి, సింగిల్ విండో క్లియరెన్స్ ద్వారా వేగంగా అమలు చేయాలని నిర్ణయించింది. ఈ సమ్మిట్ తెలంగాణ తలరాతను నిజంగా మార్చగలదా అనేది రాష్ట్ర ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రశ్న.


 9490520108..  వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్యలు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్రజ‌ల స‌మ‌స్యలు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్యక్తిగ‌త స‌మ‌స్యలు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: