పోషకాలు అధికంగా కలిగిన ఆకుకూరల్లో పాలకూర ఒకటి. శరీరానికి కావలసిన పోషకాలన్నీ పాలకూరలో లభిస్తాయి. వైద్యులు సైతం పాలకూరను ఆహారంలో భాగం చేసుకోవాలని సిఫారసు చేస్తూ ఉంటారు. పాలకూరలో విటమిన్ ఏ, ఫోలిడ్, క్యాల్షియం, విటమిన్ సి, ఫోలిక్ ఆమ్లం, ఐరన్ వంటి ఖనిజాలు లభిస్తాయి. దీనిని ఆహారంగా తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు కలుగుతాయి. పాలకూరను మితంగా తీసుకుంటే ఆరోగ్యానికి మేలు కలిగిస్తున్న మాట వాస్తవమే.

అయినా అతిగా తింటే మాత్రం అనర్ధాలు తప్పవు. అవసరానికి మించి ఏ ఆహారమైనా ప్రతికూల ప్రభావాన్నే చూపిస్తుంది. అలాగే పాలకూర కూడా అంతే. పాలకూర అధికంగా తీసుకోవడం వల్ల శరీరంలో ఆక్సాలిక్ యాసిడ్ ఎక్కువగా చేరుతుంది. దీన్ని మన శరీరం నుంచి బయటకు పంపడం కష్టమవుతుంది. ఇది మూత్రపిండాల్లో క్యాల్షియం ఆక్సలేట్ రాళ్ల రూపంలో మారడం జరుగుతుంది. కిడ్నీ రాళ్ల సమస్య ఉంటే మీరు పాలకూరను సరైన మోతాదులో తినాలి. అధికంగా తీసుకోకూడదు. పాలకూరలో ఆక్సాలిక్ ఆమ్లంతో పాటు బ్యూరిన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఈ రెండు సమ్మేళనాలు ఆర్థరైటిస్ కు కారణమవుతాయి. ఇప్పటికీ కీళ్ల నొప్పులు, వాపులు, మంటలతో బాధపడుతున్నవారికి పాలకూరను తీసుకోవడం వల్ల సమస్య మరింత ముదురుతుంది. పాలకూరలో ఆక్సాలిక్ ఆమ్లం అధికంగా ఉంటుంది. ఇది మొక్కలలో ఉండే సమ్మేళనం. ఇది శరీరంలో అధికంగా చేరినప్పుడు ఇతర ఖనిజాలను గ్రహించే సామర్ధ్యాన్ని ప్రభావితం చేస్తుంది.

 దీనివల్ల పోషకాహార లోపం తలెత్తవచ్చు. ఆకుపచ్చని ఆకుకూరల్లో హిస్టామిన్ ఉంటుంది. ఇది మన శరీరంలోని కొన్ని కణాలలో కనిపించే ఒక రసాయనం.ఇది అధికంగా శరీరంలో చేరడం వల్ల అలర్జీ ప్రభావాన్ని ప్రేరేపిస్తుంది. పాలకూరను ఒకేసారి అధికంగా తీసుకోవడం లేదా ఒక రోజులో విడతలవారీగా అధికంగా తినడం వల్ల శరీరంపై విష ప్రభావం పడే అవకాశం ఉంది. వీటితో పాటుగా గ్యాస్, కడుపుబ్బరం, తిమ్మిరి వంటివి కలగవచ్చు. పాలకూరలో అధికంగా ఫైబర్ ఉంటుంది. కాబట్టి అధికంగా తింటే పొట్ట సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: