
మీరు కూర్చున్నప్పుడు లేదా నిలబడినప్పుడు మీ వెన్నెముక నిటారుగా ఉండేలా చూసుకోండి. కంప్యూటర్ ముందు పనిచేస్తున్నట్లయితే, మీ స్క్రీన్ మీ కంటి స్థాయిలో ఉండేలా చూసుకోండి. ప్రతి గంటకు ఐదు నుంచి పది నిమిషాల పాటు బ్రేక్ తీసుకుని అటూ ఇటూ నడవండి లేదా మెడకు కొన్ని సులభమైన వ్యాయామాలు చేయండి. ఈ చిట్కాలు పాటించడం ద్వారా మంచి ఫలితాలు ఉంటాయి.
మెడకు సరైన సపోర్ట్ ఇచ్చే దిండును ఎంచుకోండి. మరీ ఎత్తైన లేదా మరీ పలచటి దిండ్లు వాడటం మానుకోండి. వెల్లకిలా లేదా పక్కకు తిరిగి పడుకోవడం మెడకు మంచిది. బోర్లా పడుకోవడం వల్ల మెడపై ఒత్తిడి పడుతుంది కాబట్టి దానిని నివారించడం మంచిది. మెడ వ్యాయామాలు మెడ కండరాలను బలోపేతం చేసి నొప్పిని తగ్గించడంలో సహాయపడతాయి. మీ తలను నెమ్మదిగా పక్కలకు, పైకి కిందకి తిప్పడం, భుజాలను పైకి కిందకి కదపడం వంటి సులభమైన వ్యాయామాలు చేయవచ్చు. అయితే, నొప్పి ఎక్కువగా ఉన్నప్పుడు వ్యాయామాలు చేయకూడదు.
హీట్ లేదా కోల్డ్ కంప్రెస్ కూడా మెడనొప్పి నుండి ఉపశమనం కలిగిస్తుంది. నొప్పి ఉన్న ప్రదేశంలో వేడి నీటి బ్యాగ్ లేదా వేడి టవల్ తో కాపడం పెట్టడం వల్ల కండరాలు రిలాక్స్ అవుతాయి. వాపు ఉన్నట్లయితే, ఐస్ ప్యాక్ తో కాపడం పెట్టడం మంచిది. ఒత్తిడి కూడా మెడనొప్పికి ఒక కారణం కావచ్చు. ఒత్తిడిని తగ్గించుకోవడానికి ధ్యానం, యోగా లేదా మీకు నచ్చిన హాబీలను అనుసరించండి. గోరువెచ్చని నీటితో స్నానం చేయడం కూడా కండరాలను సడలించి, ఒత్తిడిని తగ్గిస్తుంది.