బాలీవుడ్‌లో ఒకప్పుడు తెగ వినిపించిన పేరు రాఖీ సావంత్. అయితే ఈ మధ్య ఈ భామ బాగా సైలెంట్ అయిపోయింది. అంతేకాదు ఈ మధ్యనే పెళ్లి కూడా చేసుకుంది. బ్రిటన్‌కు చెందిన రితేశ్ అనే వ్యాపారవేత్తను రాఖీ ఈ మధ్యనే పెళ్లాడింది. రాఖీ ఇలా ఆకస్మికంగా పెళ్లి చేసుకోవడడంతో బాలీవుడ్ జనాలు షాకయ్యారు. ఇంత అర్జెంటుగా ఆమె పెళ్లి చేసుకోడానికి కారణం ఏంటా అని అంతా ఆశ్చర్యపోయారు. అయితే తాను పెళ్లి చేసుకోవడానికి గల కారణాన్ని తాజాగా రాఖీ బయటపెట్టింది. అయితే ఆమె అర్థాంతరంగా పెళ్లి చేసుకోవడానికి ఓ మాఫియా డాన్ కారణమని చెప్పుకొచ్చింది. అతడి నుంచి తప్పించుకునేందుకే పెళ్లి చేసుకున్నానంటూ చెప్పుకొచ్చింది.
 
పెళ్లి అనంతరం రాఖీ ఈ మధ్యనే ఓ ఇంటర్వ్యూ ఇచ్చింది. అందులో తన పెళ్లి ప్రస్తావన రావడంతో ఆమె ఈ విషయాన్ని బయటపెట్టింది. గుజరాత్‌కు చెందిన ఓ మాఫియా డాన్‌ తనను తెగ ఇబ్బంది పెట్టాడని, అందుకే తాను ఆకస్మికంగా పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందని వివరించింది. ఆ డాన్ చాలా దుర్మార్గుడని, తనను పెళ్లి చేసుకోవాలంటూ వేధించేవాడని దీంతో ఏం చేయాలో తెలియక తెగ భయపడిపోయానని రాఖి చెప్పుకొచ్చింది. ఈ క్రమంలోనే మరొకరిని పెళ్లి చేసుకుంటే తన జోలికి రాడనే ఉద్దేశంతోనే రితేశ్‌తో జీవితం పంచుకునేందుకు సిద్ధమయ్యానని రాఖీ చెప్పింది.

'ఆ వ్యక్తితో కలిసి గోవాలో డేటింగ్‌కు వెళ్లాను. ఈ సందర్భంగా ఓ భయంకరమైన వీడియో నా కంటపడింది. తన ఫాంహౌస్‌లో ఓ వ్యక్తిని అతడు చావగొడుతుండటం ఆ వీడియోలో చూశాను. అప్పట్నించి అతడికి దూరంగా ఉండేందుకు ప్రయత్నిస్తే, అతడేమో కిడ్నాప్ చేసైనా పెళ్లి చేసుకుంటా అని బెదిరించేవాడు. ఆ సమయంలోనే రితేశ్ పరిచయమయ్యాడు. తనకో మంచి వరుడ్ని చూసిపెట్టమని అతడ్నే అడిగాను. రితేశ్ సరేనన్నాడు. చివరికి రితేశ్‌నే పెళ్లి చేసుకున్నాను. ఆ విధంగా మాఫియా డాన్ ముప్పు తొలగిపోయింద"ని రాఖీ చెప్పుకొచ్చింది. అంతేకాకుండా రితేశ్ లాంటి మంచి జీవిత భాగస్వామి కూడా తనకు లభించాడని, ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నానని చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: