పెద్దగా సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన శర్వానంద్ కొద్ది కాలంలోనే ఫ్యామిలీ హీరోగా ఎదిగాడు. అసలు ఎలాంటి వివాదాల జోలికి వెళ్ళని ఆయన తాజాగా శ్రీకారం నిర్మాతలకు లీగల్ నోటీసులు జారీ చేసిన అంశం టాలీవుడ్ లో చర్చనీయాంశంగా మారింది. మాట్లాడుకున్న రెమ్యూనరేషన్ ఎంతకీ చెల్లించకపోవడంతో ఇక విసిగిపోయిన ఆయన లీగల్ నోటీసులు జారీ చేసినట్లు టాలీవుడ్ లో ప్రచారం జరిగింది. అయితే తనకు ఆరు కోట్ల రూపాయల రెమ్యునరేషన్ ఇస్తానని ఒప్పుకున్న సంస్థ నాలుగున్నర కోట్లు మాత్రమే చెల్లించిందని మరో కోటిన్నర చెల్లించడానికి మీనమేషాలు లెక్కిస్తోంది అనేది శర్వానంద్ వాదన.. 


అయితే నిర్మాతలు వాదన మాత్రం వేరేలా ఉంది. డబ్బు ఇవ్వాల్సిన మాట నిజమే కానీ ఈ విషయంలో తాము ఎలాంటి దాగుడుమూతలు ఆడటం లేదని చెబుతున్నారు. అయితే ఆ డబ్బు ఇవ్వడానికి మరికొంత సమయం కావాలని కోరుతున్నట్లు తెలుస్తోంది. శ్రీకారం షూటింగ్ విషయంలో కూడా శర్వా వల్ల తాము ఇబ్బంది పడ్డామని నిర్మాతలు చెబుతున్నారు. జాను సినిమా షూటింగ్ సమయంలో ఆయనకు గాయం కావడంతో ఆ ఎఫెక్ట్ తమ సినిమా మీద కూడా పడిందని అనుకున్నదానికంటే చాలా ఆలస్యం అయిందని చెబుతున్నారు. సినిమా అనుకున్న దాని కంటే ఏడాది ఆలస్యంగా రిలీజ్ కావడంతో ఆ భారం అంతా తామే మోయాల్సి వచ్చిందని వాళ్లు వాపోతున్నారు. 


అదీకాక సినిమా విడుదలైన సమయం కూడా కలిసి రాలేదని విడుదలైన కొద్దిరోజులకే లాక్ డౌన్ మొదలు కావడం, థియేటర్ ల మూత వెంట వెంటనే జరిగిపోయాయి అని చెబుతున్నారు. దానికి ఎవరూ ఏమీ చేయలేమని కరోనా మహమ్మారి కారణంగా ఇదంతా జరిగిందని చెబుతున్నారు. సినిమా బయ్యర్ల నుంచి కూడా తమ ఇంకా డబ్బులు రావాల్సి ఉందని అవి వస్తే శర్వానంద్ క్లియర్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నామనేది వారి వాదన. వీటన్నిటికీ మించి శ‌ర్వా నిర్మాత‌గా `కో అంటే కోటి` అనే సినిమా వ‌చ్చింది. ఆ సినిమాకి సంబంధించిన ఓ ఏరియా హక్కులు 14 రీల్స్ సంస్థ తీసుకుంది. దానికి సంబంధించి శ‌ర్వా.. 14 రీల్స్ కి కొంత అమౌంట్ ఇవ్వాలట. ఆ విష‌యం ఇప్ప‌టి వ‌ర‌కూ తేల‌లేద‌ని, అందుకే శ‌ర్వాకి ఇవ్వాల్సిన 2 కోట్లు హోల్ట్ లో పెట్టిన‌ట్టు స‌మాచారం. ఈ అంశం శ‌ర్వాతో మాట్లాడి పుల్ స్టాప్ పెట్టాల‌నుకుంటోందని అంటున్నారు. సో ఈ అంశం త్వ‌ర‌లోనే ఓ కొలిక్కి రావొచ్చని అంటున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: