శ్రీకాకుళం స్లాంగ్ తో కామెడీని పండించి ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించే కమిడియన్ షకలక శంకర్. ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ షోతో మంచి కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకుని అభిమానులను పెంచుకున్నాడు. ఆ తరవాత బుల్లితెర నుండి వెండి తెరపై కూడా తన సత్తా చాటాడు శంకర్. ఏదో సాధించాలనే దృఢ సంకల్పంతో 2000 వ సంవత్సరంలో హైదరాబాద్ లో అడుగుపెట్టి వివి వినాయక్, హరీష్ శంకర్, కోన వెంకట్ వంటి సినీ ప్రముఖుల వద్ద ఆఫీస్ బాయ్ గా పనిచేసాడు. అంతేకాదు కూటి కోసం కోటి పనులు అన్నట్టుగా పెయింటర్ గా అలాగే హోటల్స్ కూడా పనిచేశాడు. పనిని దైవంగా భావించి శ్రద్ధగా చేశాడే తప్ప ఏనాడూ ఈ పని చేయడమేంటి అనుకోలేదు. అలా తన బ్రతుకు జీవనం సాగిస్తూనే ఇండస్ట్రీలో అవకాశాల కోసం చూసేవాడు శంకర్.

అలా జబర్దస్త్ షోలో ఛాన్స్ వచ్చింది. దొరికిన అవకాశాన్ని సద్వినియోగ పరచుకుని తన టాలెంట్ ను కనబరిచాడు. జబర్దస్త్ స్టేజ్ పై నవ్వులు పోయించాడు. షోకి జడ్జిలుగా వ్యవహరించిన నాగబాబు, రోజాల మెప్పును పొందాడు. అంతే కాదు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి వీరాభిమానిగా తన అభిమానాన్ని చాటి చెప్పాడు. దాంతో మరింత క్రేజ్ ను సంపాదించుకున్నాడు షకలక శంకర్.  2000 సంవత్సరంలో హైదరాబాద్ బాట పట్టిన శంకర్ దాదాపు ఎనిమిదేళ్లు తన  ఇంటి  వైపు చూసింది లేదట కనీసం ఫోన్ కూడా చేయలేదట. వాళ్ళ ఇంట్లో వాళ్ళు వెతికి వెతికి కొడుకు మరణించాడని నిశ్చయించుకుని ఫోటో కూడా పెట్టుకున్న సందర్భం ఉంది. ఆ తర్వాత ఒకసారి సెట్ లో శంకర్ ని చూసిన వారి బంధువు వాళ్ళ ఇంట్లో చెప్పడంతో అపుడు శంకర్ బ్రతికే ఉన్నాడని తనకు నచ్చిన సినిమా ఇండస్ట్రీ చుట్టే తిరుగుతున్నాడని వాళ్లకు తెలిసింది.  

జబర్దస్త్ షోలో ఓ టీం లీడర్ గా చేస్తున్న చంటి ఒకసారి శంకర్ ను చూసి నా టీం లో చేస్తావా అని అవకాశం ఇచ్చారు. అలా జబర్దస్త్ స్టేజి పైకి ఎక్కి కామెడీ దుమ్ము లేపాడు మన శంకర్. ముఖ్యంగా రామ్ గోపాల్ వర్మ గెటప్ లో ఆయనలా నటించి అందరి దృష్టిని ఆకర్షించాడు.  ఎక్స్ ప్రెస్ రాజా, గీతాంజలి, రాజుగారి గది, ఇంట్లో దెయ్యం నాకేం భయ్యం వంటి చిత్రాల్లో కమెడియన్ గా మంచి పాత్రలు పోషించాడు. అంతేకాదు తన ప్రియతమ నటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చిత్రం సర్దార్ గబ్బర్ సింగ్ లో నటించి అలరించాడు. అయితే ఆ మూవీ షూటింగ్ సమయంలో అసిస్టెంట్ దర్శకులతో శంకర్ కు ఏదో చిన్న వివాదం జరిగిందని ఆ విషయమై పవన్ కళ్యాణ్ శంకర్ ను మందలించినట్లు అప్పట్లో వార్తలు కూడా చాలానే వినిపించాయి. అలా సినిమాలలో చాలా బిజీ అయిపోయాడు శంకర్. శంభో శంకర అనే చిత్రంతో హీరోగా మారి హిట్ ను అందుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: