మాస్ జ‌నాల‌కు ఆక‌ట్టుకోవ‌డం ర‌జ‌నీకాంత్ కు తెలిసినట్టుగా మ‌రే హీరోకు తెలియ‌ద‌నే చెప్పాలి. అందుకు ఆయ‌న అనుస‌రించే ఢిప‌రెంట్ మేన‌రిజ‌మ్, స్టైలిష్ యాక్ష‌న్ ఇత‌ర హీరోలెవ‌రూ అనుక‌రించ‌లేనిది. అందుకే భార‌తీయ‌ వెండితెర‌పై స్టైల్ అంటే గుర్తుకొచ్చే మొద‌టి పేరు సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్. ఆయ‌న త‌న‌దైన శైలిలో తల తిప్పి చూసినా, కాలు క‌దిపినా, చేతులెత్తి న‌మ‌స్క‌రించినా చివ‌ర‌కు సిగిరెట్ వెలిగించినా..  ఏం చేసినా స‌రే తమిళ‌నాట ఆ విభిన్న‌మైన న‌ట‌న‌కు అభిమానులంతా వెర్రెత్తిపోతారు.  ఆ మాట‌కొస్తే త‌మిళ జ‌నం మాత్ర‌మే కాదు.. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఆయ‌న అభిమాన గ‌ణం అంతా అంతే. అందుకే మ‌రే భార‌తీయ‌ హీరోకి లేన‌ట్టుగా జ‌పాన్‌లో సైతం ర‌జనీ అంటే ప్రాణం ఇచ్చే అభిమానులున్నారు. అప్పుడెప్పుడో మూడు ద‌శాబ్దాల క్రితం జ‌య‌సుధ‌, సుమ‌న్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో తెలుగులో వ‌చ్చిన న్యాయం మీరే చెప్పాలి చిత్రంలో ఓ పాత్ర‌లో కాసేపు క‌నిపించే ర‌జ‌నీకాంత్ ఆ పాత్ర‌తోనే ప్రేక్ష‌కులంద‌రినీ త‌న స్టైల్ తో క‌ట్టిపడేశారు. ఆ త‌రువాత పెద‌రాయుడు సినిమాలో మ‌రోసారి కాసేపే క‌నిపించినా ఆ పాత్ర‌ను ఎవ‌రూ ఇప్ప‌టికీ మ‌ర‌చిపోలేరు ద‌టీజ్ ర‌జ‌నీకాంత్‌. ఇంత‌కూ త‌న‌దైన స్టైల్‌ను ఆయ‌న ఎలా.. ఎందుకు అల‌వ‌ర‌చుకున్నారు..? ఇలాంటి ప్ర‌శ్న‌లకు గ‌తంలో చాలాసార్లే ర‌జ‌నీ స‌మాధానం చెప్పారు.
 
           అదేంటంటే న‌టుడిగా త‌న‌కు ఉన్న ప‌రిమితులు ఏంటో త‌న‌కు బాగా తెలుసున‌ని, త‌న‌కంటే స్క్రీన్‌పై అందంగా క‌నిపించే న‌టులు, మంచి ఫిజిక్ ఉన్న‌వారితో పోటీ ప‌డాల‌ని గుర్తించాక మ‌రింత క‌ష్ట‌ప‌డి డిఫ‌రెంట్ క‌నిపించేలా ప్రాక్టీస్ చేసేవాడిన‌ని చెప్పారు ర‌జ‌నీకాంత్‌. ప్ర‌త్యేకంగా మాస్‌ను ఆక‌ట్టుకునే శైలిలో న‌టించ‌డం అల‌వాటు చేసుకున్నాన‌ని ప‌లు సంద‌ర్భాల్లో చెప్పారు.  ఇక ర‌జ‌నీ స్టైల్‌కు స్టార్ హీరోలు కూడా అభిమానులే. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ సైతం రోబో-2లో ర‌జ‌నీతో క‌లిసి న‌టించే స‌మ‌యంలో ఆయ‌న స్టైల్‌కు అభిమానినైపోయాన‌ని చెప్ప‌డం విశేషం. అక్ష‌య్ మాత్ర‌మే కాదు.. ఇదే మాట చాలామంది హీరోలు చెపుతారు. అయితే ర‌జ‌నీకాంత్ మాత్రం న‌ట‌న విష‌యానికొస్తే క‌మ‌ల్‌హాస‌న్ త‌న‌కంటే ప్ర‌తిభ క‌లిగిన గొప్ప న‌టుడ‌ని ఏ భేష‌జం లేకుండా చెపుతారు.

మరింత సమాచారం తెలుసుకోండి: