ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు అన్నీ పనికిమాలిన నిర్ణయాలే అని అక్కడి ప్రజలు మండి పడుతుండడం మనం చూస్తూనే ఉన్నాం. ఇదిలా ఉండగా… అసెంబ్లీ సమావేశాలు ముగుస్తున్న సందర్భంగా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ కి వైయస్సార్ పేరు పెట్టాలనే నిర్ణయం తీసుకుని ఉత్తర్వులు కూడా జారీ చేసింది.


ఈ విషయం పై తెలుగుదేశం పార్టీ నేతలు, నందమూరి అభిమానులు తీవ్రంగా మండిపడుతున్నారు. 'ఎన్టీఆర్' పేరును తొలగించి వైయస్సార్ పేరును పెట్టడం పట్ల జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.


ఈ విషయం పై జూనియర్ ఎన్టీఆర్ నిన్న సోషల్ మీడియా వేదికగా స్పందించిన సంగతి తెలిసిందే. 'ఎన్టీఆర్, వైయస్సార్ ఇద్దరూ విశేష ఆదరణ సంపాదించిన గొప్ప నాయకులు. ఈ రకంగా ఒకరి పేరు తీసి మరొకరి పేరు పెట్టడం ద్వారా తెచ్చే గౌరవం వైయస్సార్ స్థాయిని పెంచదు. ఎన్టీఆర్ స్థాయిని తగ్గించదు. ఈ యూనివర్సిటీకి పేరు మార్చడం ద్వారా ఎన్టీఆర్ సంపాదించుకున్న కీర్తిని తెలుగుజాతి చరిత్రలో వారి స్థాయిని, తెలుగు ప్రజల హృదయాల్లో ఉన్న జ్ఞాపకాలను చెరిపి వేయలేరు' అంటూ ఎన్టీఆర్ పేర్కొన్నాడు.


 


ఈ పోస్ట్ పై కొందరు నందమూరి అభిమానులు మరియు టీడీపీ అభిమానులు మండిపడుతున్నారు. 'వైఎస్సార్ ను ఎన్టీఆర్ తో పోల్చడం ఏంటి? ఎన్టీఆర్ స్థాయి ఎక్కడ.. వైఎస్సార్ స్థాయి ఎక్కడ' అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇంకొంతమంది అయితే 'నీ కంటే షర్మిల బెటర్… ధైర్యంగా వాస్తవం చెప్పింది' అంటూ విమర్శిస్తున్నారు.వై.ఎస్.షర్మిల కూడా ఎన్టీఆర్ పేరు తొలగించడం తప్పు అని మీడియాతో చెప్పిన సంగతి తెలిసిందే. ఏది ఏమైనా ఎన్టీఆర్.. రాజకీయాలకు దూరంగా ఉండాలి అనే ఉద్దేశంతో ఆ పోస్ట్ వేసి ఉండొచ్చు. కానీ అతన్ని ట్రోల్స్ మాత్రం వెంటాడుతున్నాయి.దీనిని ఎన్టీఆర్ ఎలా రిసీవ్ చేసుకుంటాడో చూడాలి మరి. ఎన్టీఆర్ అభిమానులు మాత్రం ఎన్టీఆర్ కు సపోర్ట్ గా నిలుస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: