నటనంటే గ్లామర్ మాత్రమే కాదు. ఆ పదానికి గ్రామర్ తెలిసినా సరిపోతుంది అని నిరూపించిన నటిమణి సాయి పల్లవి. కురచ దుస్తులు వేసుకొని..అంగాంగ ప్రదర్శన చేసే నటీమణుల మాదిరి కాకుండా కేవలం అభినయాన్ని మాత్రమే నమ్ముకొని వరుస సినిమాలు చేస్తోంది. పుట్టింది తమిళనాడులో అయినప్పటికీ.. తమిళం, మలయాళం, తెలుగులో కల్ట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పరచుకున్న నటీమణుల్లో సాయి పల్లవి ముందు వరుసలో ఉంటారంటే అతిశయోక్తి కాదు. ఇటీవల ఈమె నటించిన గార్గి సినిమా ఏ స్థాయిలో విజయవంతమైందో చెప్పాల్సిన అవసరం లేదు. సాయి పల్లవి దక్షిణాదిలో కథానాయక ప్రాధాన్యం ఉన్న సినిమాలకు కేరాఫ్ అడ్రస్. అలాగని కమర్షియల్ సినిమాలను కూడా వదలలేదు. ఫిదా, ఎంసీఏ, పడి పడి లేచే మనసు, శ్యాం సింగరాయ్, విరాటపర్వం, మలయాళ ప్రేమమ్ ఇలా ఏ సినిమా చేసినా ఆమె కంటూ ఒక గుర్తింపు ఉండేలాచూసుకుంది.

-పూర్తి శాకాహారి
సాయి పల్లవి వృత్తిరీత్యా వైద్యురాలు. పూర్తి శాకాహారి. అన్నం, పప్పు ఇవి ఉంటే చాలు. సినిమా సెట్ లో ఉన్నప్పుడు కొబ్బరినీళ్లు, మజ్జిగ తప్ప ఇంకా ఏమీ అడగదు. అలాగని పెద్దగా వర్కౌట్లు కూడా చేయదు. అప్పుడప్పుడు బ్యాడ్మింటన్ ఆడుతుంది. ఆమె శరీరతత్వం బట్టి త్వరగా బరువు పెరగదు. అందువల్ల ఆమెకు కసరత్తులు చేసే అవసరం ఏర్పడలేదు. పైగా సోషల్ మీడియాలో పెద్దగా టచ్ లో ఉండదు. అదంతా టైం వేస్ట్ వ్యవహారం అని కొట్టి పారేస్తుంది.. మరీ ముఖ్యమైన విషయాలు అయితే ఆమె చెల్లి చెబుతుంది. ఫలానా హీరోతో కలిసి నటించాలనే ఆలోచనలు సాయి పల్లవికి
లేవు. ఆమె దృష్టిలో సినిమా అంటే కథ బాగుండాలి. అలా ఉంటే ఎవరిపక్కనైనా నటిస్తుంది. ఎవరైనా దర్శకులు ఆమెను సంప్రదిస్తే ముందు కథ చెప్పమంటుంది. ఇండస్ట్రీలో ఆమె అందరు హీరోలను గౌరవిస్తుంది. సాయి పల్లవి కి అల్లు అర్జున్ డాన్స్ అంటే ఇష్టం. మరీ ముఖ్యంగా మహేష్ బాబు స్క్రీన్ ప్రజెన్స్ అంటే చాలా ఇష్టం. మగాళ్లు ఇంత అందంగా ఉంటారని మహేష్ బాబును చూసాకే తనకు అర్థమైందని పలమార్లు చెప్పుకొచ్చింది. ఒకసారి ఆయనను చూస్తే ఆశ్చర్యపోస్తుంటానని సిగ్గుల మొగ్గ అయ్యింది. బాలీవుడ్లో ఇమ్రాన్ ఖాన్ అంటే సాయి పల్లవికి చాలా ఇష్టం.డాన్స్ కూడా ప్రత్యేకంగా నేర్చుకోలేదు
సాయి పల్లవి డాన్స్ చూస్తే నెమలి నాట్యం వేస్తున్నట్టు అనిపిస్తుంది. ఆమె నటనకు ఎంతమంది అభిమానులు ఉన్నారో, డ్యాన్స్ కు అంతకుమించి ఉన్నారు. ఫిదా లో వచ్చిండే మెల్ల మెల్లగా వచ్చిండే, లవ్ స్టోరీ లో సారంగదరియా.. ఈ పాటలు చాలు.. సాయి పల్లవి ఏ తీరుగా డ్యాన్స్ ఇరగదీయగలదో చెప్పేందుకు.. ఈ స్థాయిలో డ్యాన్స్ చేసే సాయి పల్లవి ఎక్కడా కూడా నేర్చుకో లేదంటే నమ్మగలమా? కానీ నమ్మి తీరాల్సిందే. ఇప్పటికీ నటనను ఎక్కడ నేర్చుకోలేదని చెప్పే సాయి పల్లవి.. ఇంట్లో ఎలా ఉంటానో స్క్రీన్ పై కూడా అలానే కనిపిస్తా అని కుండబద్దలు కొట్టేస్తుంది. తన నటన బాగుందని ఎవరైనా ప్రశంసిస్తే..సాయి పల్లవి అమ్మ ఒప్పుకోదు. ఎందుకంటే సాయి పల్లవి నటించింది అంటే ఆమె నమ్మదు. ఇంట్లో ఎలా ఉంటుందో స్క్రీన్ పై కూడా అలా ఉంటుంది కాబట్టి.. . చిన్నప్పుడు సాయి పల్లవి మాధురి దీక్షిత్ వీడియోలు బాగా చూసేదట. ఆ స్టెప్పులు చూసి బాగా ప్రాక్టీస్ చేసేదట. ఇప్పుడు సాయి పల్లవి అని ఆమె తల్లిదండ్రులు భరతనాట్యం క్లాసులకు పంపేవారు. వారం పాటు ఒకే స్టెప్పు నేర్పించడంతో విసుగుచెంది పారిపోయి వచ్చేసిందట. ఇక సినిమాలోకి సాయి పల్లవి వచ్చేటప్పుడు అనేక భయాలు ఉండేవట. ఎందుకంటే తాను అంత అందంగా ఉండనని, మొహం మీద మొటిమలు ఉంటాయని ఇబ్బంది పడేదట. తాను అసలు హీరోయిన్ మెటీరియల్ కాదని తేల్చి చెప్పేదట.
తనను స్క్రీన్ పై ప్రేక్షకులు చూడలేరని భయపడే దట. మలయాళంలో తీసిన ప్రేమమ్ సినిమా మొదటి రోజు షూటింగ్లో నేను మీ పాత్రకు సరిపోతానా? లేదా మధ్యలోనే తీసేస్తారా అంటూ దర్శకుడు పుత్రేన్ ను రకరకాల ప్రశ్నలు అడిగేదట. కానీ తాను రాసుకున్న పాత్రకు వేరే హీరోయిన్ ను ఊహించుకోలేక పుత్రేన్ సాయి పల్లవి లో ఆత్మవిశ్వాసాన్ని పెంచేందుకు రకరకాల మాటలు చెప్పేవారట. కానీ ప్రేమమ్ విడుదలయ్యాక అందరూ సాయి పల్లవి గురించి మాట్లాడుతుంటే ఏడ్చేసిందట!
ఫిదా, లవ్ స్టోరీ ఫేవరెట్ సినిమాలు
ఎన్ని సినిమాలు చేసినా ఇప్పటికీ ఫిదా, లవ్ స్టోరీ తన ఫేవరెట్ అని సాయి పల్లవి చెబుతుంది. ఫిదా సినిమా అయితే సాయి పల్లవి ప్రయాణాన్ని పూర్తిగా మార్చేసింది. ఆ విషయంలో తాను శేఖర్ కమ్ములకి రుణపడి ఉంటానని పలు సందర్భాల్లో చెప్పింది. ఆయన తన కెరీర్ మాత్రమే కాదు ఆలోచన విధానాన్ని కూడా పూర్తిగా మార్చేశారని కితాబు ఇచ్చింది. షూటింగ్ సెట్లో 100 మంది ఉంటే.. అందరినీ సమానంగా చూసే అలవాటు బహుశా ఆయనకు ఒక్కరికే ఉంటుందని లవ్ స్టోరీ సినిమా ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ లో పొగిడింది. గార్గి విజయవంతం తర్వాత సాయి పల్లవి కొత్తగా ఏ సినిమాలకు సైన్ చేయలేదు. కొన్ని కథలు మాత్రం చర్చల దశలో ఉన్నాయి. ఒకప్పుడు సావిత్రి, తర్వాత సౌందర్య, ప్రస్తుత తరంలో సాయి పల్లవి.. కొందరి నటీమణుల అభినయాన్ని అంత ఈజీగా ప్రేక్షకులు మర్చిపోరు. మర్చిపోరు అంతే!

మరింత సమాచారం తెలుసుకోండి: