టాలీవుడ్ సినిమా పరిశ్రకు అక్కినేని నాగేశ్వర రావు హీరోగా తెరకెక్కిన బుద్దిమంతుడు సినిమాతో నటుడిగా రంగప్రవేశం చేసిన నటుడు రంగనాథ్. ఆ తరువాత పలు సినిమాల్లో అక్కడక్కడా చిన్న పాత్రల్లో నటించారు. అయితే అదే సమయంలో నటుడు గిరిబాబు ప్రోత్సాహంతో చందన అనే సినిమాలో హీరోగా కూడా నటించిన రంగనాథ్, ఆపై ఎక్కువగా అన్న, స్నేహితుడు వంటి పాత్రలు పలు సినిమాల్లో పోషించి మంచి పేరు గడించారు. 1949లో మద్రాసులో జన్మించిన రంగనాథ్, తిరుపతి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో బీఏ డిగ్రీ పట్టా పుచ్చుకున్నారు. అనంతరం కొన్నాళ్ళు ఇండియన్ రైల్వే లో టికెట్ కలెక్టర్ గా కూడా పని చేసిన రంగనాథ్, అనంతరం థియేటర్ ఆర్ట్స్ లో నటనలో శిక్షణపొంది ఆపై సినిమాల్లోకి ప్రవేశించారు. ఇక ఆయన నటించిన సినిమాల్లో జామిందరుగారి అమ్మాయి, దేవతలారా దీవించండి, పంతులమ్మ, ఇంటింటి రామాయణం, అమెరికా అమ్మాయి

 

అందమే ఆనందం, వేట, ముగ్గురు మొనగాళ్లు, దొంగమొగుడు, బృదావనం, మన్మధుడు, కలిసుందాం రా, నిజం వంటి సినిమాలు ఆయనకు నటుడిగా మంచి పేరు తెచ్చిపెట్టాయి. ఇక నటుడిగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి చరిత్ర అనే సినిమాలో ఆఖరుగా నటించిన రంగనాథ్ 2015, డిసెంబర్ 19న హైదరాబాద్ లోని తన అపార్ట్మెంట్ లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. కాగా ఆయన భార్య తిరుమల చైతన్య 2009లో అనారోగ్య కారణాలతో మరణించడం జరిగింది. కాగా రంగనాథ్ కు ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు. మధ్యలో కొన్ని టివి సీరియల్స్ లో కూడా నటించిన రంగనాథ్, శివాజీ రాజా హీరోగా తెరకెక్కిన మొగుడ్స్ పెళ్లామ్స్ అనే సినిమాకు దర్శకత్వం కూడా వహించారు. 

 

అయితే  ఇటీవల ఒక మీడియా ఛానల్ ఇంటర్వ్యూ లో సీనియర్ పాత్రికేయులు ఒకరు రంగనాథ్ గారి మరణం గురించి మాట్లాడుతూ, మొదటి నుండి భార్య తిరుమల చైతన్య గారంటే రంగనాథ్ కు ఎంతో ప్రేమ ఉండేదని, ఇక ప్రతి విషయాన్నీ ఆమెతోనే పంచుకుంటూ ఎంతో మధురంగా, ప్రేమానురాగాలతో సాగిన వారి దాంపత్యంలో, ఉన్నట్లుండి భార్య మృతి చెందడంతో రంగనాథ్ ఒక్కసారిగా కృంగిపోయారని, అప్పటికే కొడుకు, కూతుళ్ళకు పెళ్ళిళ్ళై విడిగా ఉంటుండడంతో, తానే ఒంటరిగా ఒక ఫ్లాట్ అద్దెకు తీసుకుని కొన్నేళ్ల పాటు జీవనం సాగించారని, అయితే ఎప్పుడూ భార్యనే తలచుకుంటూ తన మిత్రులు, శ్రేయోభిలాషుల వద్ద ఎంతో మధనపడ్డ రంగనాథ్, ఆ ఆవేదన తట్టుకోలేకనే ఒకరోజున ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు.రంగనాథ్ మరణం నిజంగా తెలుగు సినిమా పరిశ్రమకు తీరని లోటని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: