
అసలే కొత్త పెళ్లి కూతురు.. అందులోనూ చిట్టి చెల్లెలు.. తనకు దూరంగా... మెట్టినింటికి వెళ్లిపోతోంది. ఇక ఆ అన్నయ్య మనసులో ఎలా ఉంటుందో అర్థం చేసుకోండి. ప్రస్తుతం మెగా హీరో వరుణ్ తేజ్ కూడా అలాంటి పరిస్థితుల్లోనే ఉన్నాడు. చెల్లెలు నిహారిక పెళ్లి చేసుకుని వెళ్లిపోతుండడంతో వరుణ్ చాలా భావోద్వేగానికి గురవుతున్నాడు. చెల్లెలు పుట్టినరోజున తన భావోద్వేగాన్నంతా కలిపి ఓ పోస్ట్ ద్వారా తన చెల్లికి చేరవేశాడు. ‘నువ్వు అప్పుడే ఇంత పెద్ద అమ్మాయివి అయ్యావు అంటే నేను నమ్మలేక పోతున్నాను. అయినా కూడా నువ్వు నాకు ఎప్పటికి చిన్న పిల్లవే. నీ చుట్టు ఉన్న వారిలో ఎప్పుడు ఆనందాన్ని నింపుతూ వచ్చావు. నీవు నా జీవితంలో ఉన్నందుకు నేనెంతో లక్కీ.. హ్యాపీ బర్త్ డే బంగారు తల్లి’ అంటూ ఓ ట్వీట్ చేశాడు.
ఈ ట్వీట్‌తో నిహారిక సంతోషానికి కూడా హద్దులు లేకుండా పోయింది. వెంటనే రిప్లై ఇచ్చింది. ‘అన్నా.. బంగారుకొండ... ఐ లవ్ యూ సో మచ్’ అంటూ ముద్దుల ఎమోజీలతో ట్వీట్ నింపేసింది. ఇప్పుడు ఈ అన్నా, చెళ్లెల్ల ట్వీట్‌లు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ‘బ్రదర్ అండ్ సిస్టర్ అంటే ఇలా ఉండాలి. ఒకరిపై ఒకరికి ఎంత ప్రేమో కదా..’ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మరికొందరైతే ‘అన్నయ్య వరుణ్ తేజ్‌కు నిహారిక ఎంతో ముద్దుగా రిప్లై ఇచ్చింద’ని మెచ్చుకుంటున్నారు. ఇంకొందరైతే.. ‘మీ ఇద్దరి మధ్య బంధం కలకాలం ఇలాగే కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం’ అంటూ రీ ట్వీట్‌లు చేస్తున్నారు.