అరకొర సక్సెస్లతో మహేష్ బాబు కష్టాలు పడుతున్న రోజులవి. గుణశేఖర్ ఎన్నో కష్టాలకు ఓర్చి మహేష్ బాబు తో తీసిన ఒక్కడు సినిమాతో అయన సాదాసీదా హీరో నుండి స్టార్ హీరో అయ్యాడు. ఇప్పటికి ఆ సినిమా విడుదల అయ్యి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. సంక్రాంతి సందర్భంగా 15 జనవరి 2003న సినిమా రిలీజ్ అయ్యింది. చార్మినార్ ఓల్డ్ సిటీ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రంలో మహేష్ బాబు సరసన భూమిక హీరోయిన్ గా నటించగా, ప్రకాష్ రాజ్ తనదైన విలనిజంతో సినిమాను మరొక మెట్టు ఎక్కించాడు.  ఈ సినిమా ఘనవిజయం సాధించిన తర్వాత తమిళం, కన్నడ, హిందీ, బెంగాలీ బాషలలో రీమేక్ చేయబడింది. ఒక్కడు సినిమాలో గల్లీల్లోని కుర్రాళ్ళు, గ్యాంగుల గొడవలు, వాళ్ళలో గ్రూపులు వంటి అంశాలు ఉండటం వల్ల మొదట ఒక్కడు అనే టైటిల్ కాకుండా కథ పరంగా 'అతడే ఆమె సైన్యం' అనే పేరును నిశయించారు. హీరోయిన్ ని కాపాడే హీరో రోల్ అవ్వడంతో ఈ టైటిల్ బాగుంటుంది అని దర్శకనిర్మాతలు భావించి అదే పేరును ఫిలిం ఛాంబర్ లో రిజిస్ట్రేషన్  చేసారు.

ఇక సినిమాలో మహేష్ బాబు కబడ్డీ ఆటగాడిగా కనిపిస్తాడు. వాస్తవానికి మహేష్ బాబు కి కబడ్డీ ఆడటం అస్సలు తెలియదట. అందువల్ల కొన్ని రోజుల పాటు కబడ్డీ ప్రాక్టీస్ చేసాడు. ఇక ఈ సినిమాకు చార్మినార్ సెట్ చాలా హైలెట్ అయ్యింది. దీనికోసం  హైదరాబాదు శివార్లలో నిర్మాత రామానాయుడికి ఉన్న పదెకరాల స్థలంలో సెట్ వేశారు. చార్మినార్ సెట్ నిర్మాణం ఖర్చు ఆ రోజుల్లోనే రూ.కోటి డెబ్భై లక్షలు అయ్యింది. ఇక సినిమాకోసం మొత్తం ఖర్చు రూ.14 కోట్ల వరకూ పెట్టారు. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వడమే కాదు ఇండస్ట్రీ హిట్ గా నిలిచి మహేష్ బాబు రేంజ్ అమాంతం పెరిగిపోయింది. ఈ చిత్రానికి ముందే రాజకుమారుడు, మురారి వంటి సినిమాలు మంచి హిట్లుగా నిలిచినప్పటికీ ఈ చిత్రం మహేష్ బాబు కెరీర్ లోనే అతి పెద్ద మొదటి బ్లాక్ బస్టర్ హిట్ గా మిగిలిపోయింది. ఇక ఈ చిత్రాన్ని కన్నడ లో  పునీత్ రాజ్ కపూర్, అనురాధా మెహతా హీరో, హీరోయిన్స్ గా రీమేక్ చేయగా తమిళ్ లో విజయ్, త్రిష జనతా గిల్లి పేరుతో రీమేక్ చేసారు. ఇక అప్పటికే విజయ్ హీరో గా మంచి సినిమాల్లో నటిస్తున్నప్పటికీ ఈ చిత్రం ఘనవిజయం సాధించడంతో విజయ్ సైతం స్టార్ హీరోగా ఎదిగాడు. అక్కడ నుండి ఇటు విజయ్ కానీ అటు మహేష్ గాని వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ఇక కన్నడ హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని రీమేక్ చేసినప్పటికీ పెద్దగా ఆకట్టుకోలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: