
రిపబ్లిక్ టీవీ చానల్ సీఈవో అర్నాబ్ గోస్వామి వాట్సాప్ చాట్ లీక్‌పై తెలుగు సినీ దర్శకుడు, రచయిత బీవీఎస్ రవి ఆందోళన వ్యక్తం చేశారు. బయటికి లీకైన 500 పేజీల ఆర్నాబ్ వాట్సాప్ చాట్ గనుక నిజమే అయితే మనం అందరం నకిలీ ప్రజా స్వామ్యంలో ఉన్నట్లే అని ఆయన అభిప్రాయ పడ్డారు. తను ఎవరైనా ఒకరికి వ్యతిరేకంగా మాట్లాడితే దానర్థం.. వారి వ్యతిరేకులతోనో వేరే వాళ్లతోనో కలిసినట్లు కాదని బీవీఎస్ రవి స్పష్టం చేశారు.
తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా ఆర్నాబ్ వాట్సాప్ లీక్‌పై బీవీఎస్ రవి స్పందిస్తూ ‘‘అర్నాబ్ వాట్సాప్ చాట్ నిజమే అయితే, మనమంతా నకిలీ ప్రజా స్వామ్యంలో బతుకుతున్నామని అర్థం. రాజకీయ పరంగా నాకు ఏ ఇతర న్యూస్ చానళ్లతో సంబంధాలు లేవు’’ అని ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌కు ‘ఆర్నాబ్ గోస్వామి ఎక్స్‌పోస్‌డ్’, ‘అర్నాబ్ గేట్’ అనే రెండు హ్యాష్ ట్యాగుల్ని కూడా జత చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఆర్నాబ్ వాట్సాప్ చాట్ లీక్‌పై దేశం మొత్తం చర్చించుకుంటున్న సమయంలో ఈ తెలుగు డైరెక్టర్ ఇలాంటి ట్వీట్ చేయడంతో దీనిపై పెద్ద చర్చే జరుగుతోంది.