కరోనా అన్ లాక్ నిబంధనల ప్రకారం సినిమా థియేటర్లు తెరచినా.. 50శాతం ఆక్యుపెన్సీ అనే అంశం ఇబ్బంది పెడుతూనే ఉంది. 100 సీట్లు ఉన్న థియేటర్లో కేవలం 50 టికెట్లే అమ్ముడుపోతే పరిస్థితి ఏంటి? టికెట్ రేటు పెంచినా పెద్దగా ఉపయోగం లేని సందర్భంలో నిర్మాతలు, ఎగ్జిబిటర్లు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. అయితే కేంద్రం తాజాగా తీసుకున్న నిర్ణయం సినీ వర్గాల్లో సంతోషం నింపింది. ఫిబ్రవరి 1నుంచి థియేటర్ల ఆక్యుపెన్సీని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు అనుమతి ఇచ్చింది.

గతంలో 50శాతం ఆక్యుపెన్సీతో సినిమా థియేటర్లు తెరిచేందుకు అనుమతిచ్చిన కేంద్రం.. ఈసారి అంతకన్నా ఎక్కువ సామర్థ్యంతో తెరుచుకోవచ్చని తెలిపింది. దీనిపై ఆయా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల మార్గదర్శకాలకు అనుగుణంగా అనుమతికి అవకాశం కల్పించింది. అంటే పూర్తి బాధ్యత స్థానిక ప్రభుత్వాలదేనని అర్థమవుతోంది. రాష్ట్రాలు అనుమతిస్తే వంద శాతం ఆక్యుపెన్సీతో సినిమా థియేటర్లు తెరచుకునే అవకాశం ఉంటుంది.

తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు సినీ రంగానికి తమవంతు సాయం చేస్తామని ఇప్పటికే ప్రకటించాయి. కరోనా కష్టకాలంలోనూ ఆ తర్వాత పలు రాయితీలు ఇవ్వడానికి ముందుకొచ్చాయి. ఈ నేపథ్యంలో థియేటర్లను 100 శాతం ఆక్యుపెన్సీతో తెరచుకోవచ్చని ప్రకటించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అంటే తెలుగు రాష్ట్రాల్లో ఇకపై థియేటర్లకు మునుపటి కళ రాబోతోందని తెలుస్తోంది. ఇప్పటి వరకూ ఓటీటీ బాట పట్టిన సినిమాలు ఇకపై.. వెండితెరకు ఓటు వేస్తాయనమాట.

తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయంపైనే టాలీవుడ్ భవిష్యత్ ఆధారపడి ఉంటుంది. కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న వేళ.. రాష్ట్ర ప్రభుత్వాలు థియేటర్ల విషయంలో ఉదారంగా వ్యవహరిస్తే, టాలీవుడ్ కి అది పెద్ద ఊరటనిచ్చినట్టే లెక్క. ఇప్పటి వరకు నత్తనడకన సాగిన సినిమా షూటింగ్ లు కూడా ఇకపై పరుగులు పెడతాయి. సినిమాల విడుదల తేదీలు కూడా మరింత ముందుకు జరుగుతాయి. ఒకరకంగా టాలీవుడ్ కి ఫిబ్రవరి 1న పెద్ద పండగ వస్తుందని చెప్పుకోవచ్చు. 

మరింత సమాచారం తెలుసుకోండి: