ఎన్టీఆర్.. ఆ మూడక్షరాలు తెలుగు తెరను ఊపేశాయి. ఎన్టీఆర్.. ఆ మూడక్షరాలు.. ఏళ్ల తరబడి తెలుగు తెరను ఏకచ్చత్రాధిపత్యంగా ఏలేశాయి. పండితులు, పామరులు అన్న తేడా లేదు.. కోస్తా, సీమ, తెలంగాణ బేధం లేదు. తెలుగు నేల నలుచెరగులా ఎన్టీవోడి నటన వైదుష్యం జేజేలందుకుంది. ఇక పౌరాణి పాత్రల్లో ఎన్టీఆర్ విజృంభణ చెప్పనలవి కాదు. ఎన్టీఆర్ జయంతి రోజు.. ఆ నటరత్న ప్రత్యేకత గుర్తు చేసుకుందాం.


ఎన్టీఆర్ పౌరాణిక పాత్రలు ప్రత్యేకత సింపుల్‌గా చెప్పాలంటే.. దానవీరశూర కర్ణ  సినిమా ఒక్కటి చాలు.. ఎన్టీఆర్‌ నటన విశ్వరూపానికి ఇదో మచ్చుతునక.. టైటిల్‌ రోల్‌ కర్ణునిగా, సుయోధునిగా, కృష్ణునిగా ఎన్టీఆర్‌ ఈ సినిమాలో మూడు పాత్రలు పోషించి నభూతో.. అనిపించారు. అందులోనూ ఈ చిత్రానికి దర్శకత్వం కూడా ఆయనే. ఈ సినిమా పేరు చెప్పగానే.. “ ఆచార్యదేవా..! హ హ హ హ.. ఏమంటివి ఏమంటివి..! జాతినెపమున సూత సుతులకిందు నిలువర్హత లేదందువా…? ఎంత మాట ఎంత మాట..!.. ఇది క్షాత్ర పరీక్ష గాని క్షత్రీయ పరీక్ష కాదే.. కాదు..  కాకూడదు.. ఇది కుల పరీక్షయే అందువా... నీ తండ్రి భరద్వాజుని జననమెట్టిది.. అంటూ సాగే సుదీర్ఘ సంభాషణలు ఎన్టీఆర్‌కు ఖ్యాతిని స్థిరం చేశాయి.


మరి ఈ డైలాగులు రాసిందెవరో తెలుసా.. అతడో మహారధి.. మహాభారతాన్ని మధించి సామాన్యుల దరి చేర్చిన ఆయన పేరు కొండవీటి వెంకటకవి. మహాభారతం కొన్ని వందల ఏళ్లుగా పవిత్ర గ్రంధంగా కొనియాడపడుతున్నా అందులో పాత్రల పుట్టు పూర్వోత్తరాల గురించి తెలుసుకున్న వాళ్ళు  అతి తక్కువమంది సమాజం దృష్టిలో వారు మహాపండితులు కానీ వారే నాడు ఆ పాత్రల గుట్టు విప్పలేదు. 1976లో ఎన్టీఆర్ దానవీరశూరకర్ణ సినిమా తీయదలచి సంభాషణల రచయితగా పని చేయాలని కొండవీటి వెంకటకవి గారిని పిలిపించారు.


ఎన్టీఆర్ వ్యక్తిగతంగా అభ్యర్ధించడంతో వారు సినిమాకు ఒప్పుకోవడంతో ఓ మహా ఘట్టానికి బీజం పడింది. ఆచార్య దేవా ఏమంటివి ఏమంటివి.. అంటూ ఆంధ్ర దేశం మారు మోగింది. మహా పాత్రల పుట్టు పూర్వోత్తరాల గుట్టు వెండితెర విప్పింది. ఏకబిగిన ఎన్టీఆర్ చెప్పిన ఆ సింగిల్ టేక్ డైలాగ్.. ఎన్టీఆర్‌కు ఎనలేని పేరు తెచ్చిపెట్టింది. ఇప్పటికీ ఎన్టీఆర్ అంటే గుర్తొచ్చేవాటిలో ఈ డైలాగ్‌ ఒకటి అంటే అతిశయోక్తి కాదేమో.


 

మరింత సమాచారం తెలుసుకోండి: