బాహుబలి తరువాత రాజమౌళి తారక్, చెర్రీలతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ చిత్రం మరికొద్ది రోజుల్లోనే ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. ఆ తరువాత మహేష్‌తో చిత్రం మొదలుపెట్టే అవకాశముంది. ఒక సినిమా పూర్తయ్యేంతవరకు మరో సినిమా గురించి ఆలోచించడం అలవాటు లేని రాజమౌళి కలల ప్రాజెక్టుగా గతంలో చెప్పిన మహాభారతం గురించి మరోసారి చర్చలు మొదలవుతున్నాయి. ఇటీవలికాలంలో దీనిపై రాజమౌళి మాట్లాడిన దాఖలాలు లేవు. అయితే ఆ ప్రాజెక్టును పక్కన పెట్టినట్టు కూడా రాజమౌళి ఎక్కడా చెప్పలేదు. మహాభారత ఇతిహాస గాథకు ఉన్న పరిధి అత్యంత విస్తృతం. ఇందులో ఒక్కో పాత్రను ప్రధాన కథాంశంగా తీసుకుని వచ్చిన చిత్రాలే భారతీయ భాషల్లో కొన్ని పదుల సంఖ్యలో ఉన్నాయి. మొత్తంగా చూస్తే కొన్ని వందల సినిమాలు వచ్చుంటాయి. ఇందులో అత్యధిక శాతం విజయవంతమైన చిత్రాలే. అంతేకాదు.. బుల్లి తెరపై సీరియల్‌గా నూ మహాభారతం ప్రజలముందుకు వచ్చి ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఎన్నిసార్లు తీసినా, చూసినా మహాభారతంలోని పాత్రలు నిత్య నూతనమే. అందుకేనేమో రాజమౌళి కూడా తన డ్రీమ్ ప్రాజెక్టుగా దీనినే ఎంచుకుంది. అయితే ఈ కథకున్న విస్తృతి రీత్యా దీనిని ఒకే భాగంగా తీయడం దాదాపు అసాధ్యం. ఒకసారి ఈ ప్రాజెక్టును మొదలుపెడితే దీని సీక్వెల్ చిత్రాలు ఎన్నుంటాయో చెప్పలేం. అందుకేనేమో రాజమౌళి తన కమిట్‌మెంట్లన్నీ పూర్తయ్యాక ఫైనల్‌గానే ఈ ప్రాజెక్టు మొదలుపెడతానని, దీనికి ఎన్నేళ్లు పడుతుందో తెలియదని గతంలోనే స్పష్టంగా చెప్పాడు. మరి మహేష్ సినిమా తరువాత రాజమౌళి ఈ ప్రాజెక్టుపైనే దృష్టిసారిస్తాడా లేక మరికొంత సమయం తీసుకుంటాడో చూడాల్సి ఉంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి