చిరంజీవి అప్పుడప్పుడూ కొంతమందికి కొన్ని షాకులిస్తుంటారు. ఆమధ్య ఓ సినిమా ఫంక్షన్లో తన సినిమా పేరు ఆచార్య అని రివీల్ చేసి దర్శకుడు కొరటాల శివకు షాకిచ్చారు. ఇప్పుడు పక్కా కమర్షియల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా వెళ్లిన చిరంజీవి.. ఈ సినిమా దర్శకుడు మారుతికి మరో షాకిచ్చారు. మారుతితో తాను సినిమా చేయడానికి రెడీగా ఉన్నానని చెప్పారు. అంతే కాదు, ప్రొడ్యూసర్ ని కూడా తానే సెట్ చేశారు చిరు తన సినిమాకు సంబంధించిన వ్యవహారాలన్నీ యువీ క్రియేషన్స్ విక్కీతో మాట్లాడాలని కూడా స్టేజ్ పైనే సూచించారు చిరంజీవి. ఆయన మాటలతో మారుతి షాకయ్యారు. ప్రస్తుతం ప్రభాస్ తో మూవీకి రెడీ అవుతున్న మారుతి, ఆ తర్వాత చిరుని డైరెక్ట్ చేయబోతున్నారనమాట.

ఆ ఫంక్షన్లో చిరు ఏమన్నారంటే..
పక్కా కమర్షియల్ సినిమా విజయవంతం కావాలని ఆకాంక్షించారు చిరంజీవి. అసలు తాను వచ్చింది సినిమా యూనిట్ కోసం కాదని, మీకోసమేనంటూ అభిమానుల్ని ఉద్దేశంచి చెప్పారు. దీంతో ఒక్కసారిగా ఫ్యాన్స్ కేరింతలతో ఆ ప్రాంగణం అంతా హోరెత్తిపోయింది. ఈ సినిమా కోసం పని చేసిన వాళ్లంతా తన కుటుంబ సభ్యుల్లాంటి వాళ్లేనని చెప్పారు చిరంజీవి. వారందరికోసం తాను తప్పకుండా సినిమా ఫంక్షన్ కి రావాల్సిందేనని నిర్ణయించుకొన్నానని చెప్పారు చిరు. అందుకే ఈ ఈవెంట్ కి వచ్చానన్నారు.

పక్కా కమర్షియల్ మూవీ హీరో గోపీచంద్ తో తనకున్న అనుబంధాన్ని చెప్పారు చిరంజీవి. గోపీచంద్ తండ్రి, దర్శకుడు టీ. కృష్ణతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. తామిద్దరం ఒకే కాలేజీలో కలిసి చదువుకున్నామని చెప్పారు. తనకు టి.కృష్ణ సీనియర్ అని, ఆయన తమకు ఎంతో ప్రోత్సాహాన్నిచ్చారన్నారని చెప్పారు. గోపీచంద్ చాలా మంచి నటుడని, కత్తిలాంటి ఆహార్యానికి తగ్గట్టే పాత్రలకు ప్రాణం పోస్తాడని పొగడ్తల్లో ముంచెత్తారు చిరు. గోపీచంద్ చేసిన సినిమాల్లో తనకు సాహసం, ఒక్కడున్నాడు, చాణక్య చాలా బాగా నచ్చాయని కూడా చెప్పారు చిరంజీవి. గోపీచంద్ కచ్చితంగా ఉన్నత స్థానాలకు వెళ్తాడని ఆకాంక్షించారు.

దర్శకుడు మారుతితో తనకున్న అనుబంధాన్ని కూడా స్టేజ్ పైనే చెప్పారు చిరంజీవి. ప్రజారాజ్యం పార్టీ ఫ్లాగ్ డిజైన్ మారుతియే చేశారని గుర్తు చేశారు. అప్పటినుంచే తమ మధ్య మంచి అనుబంధం ఉందని చెప్పారు. ఆ సమయంలోనే మారుతిలో దర్శకుడు ఉన్నాడని చెప్పానని ఇప్పుడతను సక్సెస్ ఫుల్ గా రాణిస్తున్నాడని అన్నారు. అక్కడితో ఆగకుంటా తన సినిమా ఆఫర్ ఇచ్చేశారు చిరు.

మరింత సమాచారం తెలుసుకోండి: