ఇంటర్నెట్‌డెస్క్‌: కొన్ని పాటలు ఎంత విన్నా, ఇంకా వినాలనిపిస్తూ ఉంటాయి. ఆ పాటకు నటనార్చన తోడైతే ఒళ్లు గగుర్పాటుకు గురవటమే కాదు, ఆనందంతో కంటి నుంచి అశ్రుధారలు దారులు కడతాయి.


ప్రస్తుతం థియేటర్‌లో అలాంటి అనుభూతిని పంచుతున్న పాట 'వరాహరూపం.. దైవ వరిష్ఠం..' (Varaha Roopam) కన్నడ చిత్రంగా విడుదలై ఇండియన్‌ బాక్సాఫీస్‌ వద్ద రికార్డులు సృష్టించిన 'కాంతార' (Kantara) చిత్రంలోని ఈ పాటకు ప్రేక్షకులు కూడా ఫిదా అయిపోతున్నారు. క్లైమాక్స్‌లో రిషబ్‌శెట్టి రూపకం చూసి ఒళ్లు జలదరించని ప్రేక్షకుడు లేడంటే అతిశయోక్తికాదు. అలాంటి నృత్యరూపకాన్ని ఎలా తీశారో చెబుతూ లిరికల్‌ వీడియోను చిత్ర నిర్మాణ సంస్థ హోం బాలే ఫిల్మ్స్‌ పంచుకుంది. సంప్రదాయ వాయిద్యాలతో సంగీత దర్శకుడు అజనీశ్‌ లోకనాథ్‌ స్వరాలు సమకూర్చడంతో మొదలైన పాట ఆద్యంతం అలరించేలా తీర్చిదిద్దారు. ఆ పాటను దర్శకుడు, నటుడు రిషబ్‌శెట్టి (Rishab Shetty) తెరకెక్కిస్తున్న సన్నివేశాలు, ఆ పాత్రల్లో వివిధ నటులు కనిపించిన తీరు అద్భుతంగా ఉందట.. ఈ పాటకు షాషిరాజ్‌ కవూర్‌ సాహిత్యం అందించగా, సాయి విఘ్నేష్‌ ఆలపించారని తెలుస్తుంది.


కేవలం ఐదు రాత్రుల్లో క్లైమాక్స్‌ సన్నివేశాలను తీర్చిదిద్దారు రిషబ్‌శెట్టి. వరుసగా చిత్రీకరణ జరపటం వల్ల ఒళ్లు హూనమైనా దైవం ఆవహించిన సన్నివేశాల్లో ఆ అలసట ఏమాత్రం కనిపించనీయకుండా నటించిన విధానం మెప్పిస్తోంది. హోం బాలే ఫిల్మ్స్‌ ఇచ్చిన బడ్జెట్‌లో సినిమాను పూర్తి చేసేందుకు ఎంతో నిబద్ధతతో పనిచేశారు. అందుకు నిదర్శనమే 'కాంతార' క్లైమాక్స్‌. ఆ సన్నివేశాలను తెరకెక్కించే సమయంలో ఉపవాసం చేశారు. కేవలం కొబ్బరినీళ్లు మాత్రమే తాగి, షూటింగ్‌ చేసేవారట.క్లైమాక్స్‌ షూటింగ్‌ అదనపు బాధ్యతలను రాజ్‌ బి.శెట్టికి అప్పగించి, రిషబ్‌ తెరపై శివతాండవ చేశారు.


'కాంతార' (Kantara) బ్లాక్‌బస్టర్‌ విజయంపై ఇటీవల ఓ ఇంటర్వ్యూలో రిషబ్‌శెట్టి మాట్లాడతూ.. ''నేను అంతకు ముందు ఎలా ఉన్నానో ఇప్పుడూ అలాగే ఉన్నా. కాంతార సినిమా బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ అవుతుందని అనుకోలేదు. ఒక కథ ఉంది. దానిని ప్రేక్షకులకు చెప్పాలనుకున్నా. నా టీమ్‌తో కలిసి దీనిని రూపొందించా. మేము ఈ చిత్రాన్ని ఎంతో ఏకాగ్రత, అంకితభావంతో చేశాం. నేను ఈ సినిమా షూటింగ్‌ జరుగుతున్నప్పుడు ఉపవాసం చేశాను. ఆ దేవుడే మా వెనక ఉండి షూటింగ్‌ పూర్తి చేశాడని నేను అనుకుంటాను. నేను తర్వాత ఏమి చేయాలో కూడా దేవుడే నిర్ణయిస్తాడు'' అని చాలా హుందాగా మాట్లాడారు. హోంబలే ఫిల్మ్స్‌ నిర్మించిన కాంతార సినిమాలో రిషబ్‌ శెట్టి సరసన సప్తమి గౌడ నటించిందట.. కిషోర్‌, అచ్యుత్‌ కుమార్‌, ప్రమోద్‌ శెట్టి, ప్రకాష్‌ తదితరులు కీలకపాత్రల్లో కనిపించిన ఈ సినిమా అక్టోబర్‌ 15న విడుదలై అందరి ప్రశంసలు అయితే అందుకుంటోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: