
కృష్ణ బాటలో ఆయన ఇద్దరు కుమారులు కూడా సినిమాల్లో అడుగుపెట్టారు. వారిలో చిన్న కుమారుడు మహేష్ బాబు ప్రస్తుతం టాలీవుడ్ టాప్ హీరోల్లో ఒకరిగా వెలుగొందుతున్నారు. పెద్ద కుమారుడు రమేష్ బాబు బాలనటుడిగా, తర్వాత హీరోగా నటించారు. అలాగే కృష్ణ కూతురు మంజుల కూడా నటనతో పాటు నిర్మాతగానూ నిలిచారు. మరోవైపు కృష్ణ చిన్నల్లుడు సుధీర్ బాబు కూడా నటుడిగా, ఆ తర్వాత హీరోగా మంచి గుర్తింపు పొందారు. ఇక కృష్ణ మనవడు అశోక్ గల్లా ఇప్పటికే హీరోగా లాంచ్ అవ్వగా, మహేష్ కుమారుడు గౌతమ్ చైల్డ్ ఆర్టిస్టుగా తెరపై కనిపించాడు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఘట్టమనేని కుటుంబం నుంచి మరో వారసుడు టాలీవుడ్‌లో అడుగుపెట్టేందుకు సిద్ధమయ్యాడు.
అయితే ఈసారి తెరంగేట్రం చేయబోతున్నవారు, ఘట్టమనేని కృష్ణ పెద్ద కుమారుడు రమేష్ బాబు తనయుడు జయకృష్ణ. చదువు పూర్తిచేసిన తర్వాత, సినిమాలపై ఉన్న ఆసక్తితో జయకృష్ణ నటనలో శిక్షణ తీసుకున్నాడు. ఇప్పటికే అతను ఒక ఫోటో షూట్ కూడా పూర్తి చేసుకున్నట్లు తెలుస్తోంది. దివంగత కృష్ణ, రమేష్‌లను తలపించేలా ఉన్న జయకృష్ణ, హీరోగా వెండితెరపై కనిపించబోతున్నాడన్న వార్తలపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.
తాజా సమాచారం ప్రకారం, ‘Rx 100’ ఫేమ్ దర్శకుడు అజయ్ భూపతి జయకృష్ణను హీరోగా లాంచ్ చేయబోతున్నారని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఈ ప్రాజెక్ట్‌ను ప్రముఖ నిర్మాణ సంస్థలు వైజయంతి మూవీస్ మరియు ఆనంద్ ఆర్ట్స్ కలిసి నిర్మించనున్నట్లు సమాచారం. ఇప్పటికే అనేక నట వారసులను పరిచయం చేసిన అశ్వినీ దత్, ఈసారి ఘట్టమనేని వారసుడిని వెండితెరపైకి తీసుకురాబోతున్నారు. మరోవైపు మహేష్ బాబు కుమారుడు గౌతమ్ కూడా రానున్న రోజుల్లో హీరోగా తెరంగేట్రం చేయబోతున్నాడనే వార్తలు ఉన్నప్పటికీ, ఆ కంటే ముందుగా జయకృష్ణ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడన్న సమాచారం అభిమానులను ఉత్సాహపరిచింది. అలాగే మహేష్ కుమార్తె సితార కూడా భవిష్యత్తులో సినిమాల్లోకి వచ్చే అవకాశాలపై చర్చ జరుగుతోంది.