పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న భారీ బడ్జెట్ మూవీ ‘ఓజీ’లో నారా రోహిత్‌కు కాబోయే భార్య శిరీష ఓ ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారని తాజా సమాచారం వెలువడింది. ఈ విషయం గురించి నారా రోహిత్‌ నేరుగా ధ్రువీకరించారు. ఇటీవల ‘భైరవం’ సినిమాకు సంబంధించిన ఇంటర్వ్యూలో ఓజీ గురించి సాయి దుర్గాటేజ్ అడగగా, అందుకు రోహిత్ స్పందించి, “ఓజీ సినిమాలో నాకు కాబోయే భార్య శిరీష నటించింది. ఆమెకు అక్కడ ఒక ప్రత్యేక పాత్ర దక్కింది” అని తెలిపారు. ఈ విషయం ఇప్పటివరకు ఎందుకు వెల్లడించలేదని మంచు మనోజ్ ప్రశ్నించినప్పటికీ, రోహిత్ “నువ్వు అడగలేదు కాబట్టి చెప్పలేదు” అని సరదాగా సమాధానం ఇచ్చారు.

సుజీత్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఓజీ’ సెప్టెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా పవన్ కళ్యాణ్ కెరీర్‌లో ఒక పవర్‌ఫుల్ గ్యాంగ్‌ స్టర్ యాక్షన్ డ్రామాగా ఉండనుంది. పవన్ కల్యాణ్ ప్రత్యేకమైన పాత్రలో కనిపించనున్నాడు. అంతేగాక, బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ కూడా ఈ సినిమాలో కీలకమైన ప్రత్యేక పాత్రల్లో నటిస్తున్నారు. హీరోయిన్ గా ప్రియాంక అరుల్ మోహన్ నటిస్తున్నారు.

నారా రోహిత్ 2009లో ‘బాణం’ సినిమాతో హీరోగా పరిచయమయ్యారు. తరువాత సోలో, ఒక్కడినే, ప్రతినిధి, రౌడీ ఫెల్లో, అసుర, జ్యో అచ్యుతానంద వంటి సినిమాల్లో నటించారు. 2018 తర్వాత కొంత విరామం తీసుకుని, ‘ప్రతినిధి-2’ చిత్రంలో హీరోయిన్ గా శిరీష నటించింది. ఇక శిరీష ఆస్ట్రేలియాలో ఉన్నత చదువులు పూర్తి చేసి, ఉద్యోగం కూడా చేసింది. కానీ నటనపట్ల ఆసక్తి ఉండడంతో ఇండియాకు వచ్చి సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నించింది. ‘ప్రతినిధి-2’ షూటింగ్ సమయంలో నారా రోహిత్‌తో పరిచయం అయి ప్రేమగా మారింది. రెండు కుటుంబాల అంగీకారంతో 2024లో వీరిద్దరి నిశ్చితార్థం జరిగింది. ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ వార్తను నారా రోహిత్ స్పష్టంగా ధృవీకరించగా.. ఓజీ లో శిరీష పాత్రపై అభిమానుల్లో భారీ ఆసక్తి పెరిగింది. పవన్ కళ్యాణ్ లీడర్ గా ఉన్న ఈ చిత్రంలో రోహిత్-శిరీష కాంబినేషన్ కొత్త అంచనాలు కలిగిస్తోంది. సెప్టెంబర్ 25న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: