ఒకప్పుడు దర్శకుడిగా రావాలంటే ఎవరో ఒకరి దగ్గర అసిస్టెంట్‌గా చేరాలి. చాలామంది అలాగే చేశారు. అయితే 2010 తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. సోషల్ మీడియా పుణ్యమా అని షార్ట్‌ఫిల్మ్స్ ద్వారా చాలామంది తమ టాలెంట్‌ను బయటపెట్టారు. అలాంటి వారిలో ఒకడే సుజిత్. అనంతపురంలో పుట్టిన సుజిత్ చెన్నైలో ఫిలిం కోర్స్ చేశాడు. సినిమా అంటే పిచ్చి కాదు, పిచ్చి కంటే ఎక్కువ.. ప్రాణం. 17 ఏళ్లకే షార్ట్‌ఫిల్మ్స్ తీయడం మొదలుపెట్టాడు. ఒకటి కాదు, రెండు కాదు, దాదాపు 30 షార్ట్‌ఫిల్మ్స్ తీశాడు. తెలుగు టీవీ ఛానల్ నిర్వహించిన కాంటెస్టులో పాల్గొని రన్ రాజా రన్ అనే షార్ట్‌ఫిల్మ్‌తో విజేతగా నిలిచాడు.


ఇది యూవీ క్రియేషన్స్ నుంచి వచ్చిన బిగ్ ఆఫర్‌కు కారణమైంది. మొదట లవ్ స్టోరీ చెప్పాడు. నిర్మాతలకు బాగా నచ్చింది. కానీ బడ్జెట్ సమస్యల కారణంగా ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది. ఆ బాధలో వర్షంలో బండి తోసుకుంటూ ఇంటికి వెళ్తున్న సమయంలో కొత్త కథ ఫ్లాష్ అయింది. మూడు రోజుల్లో పూర్తి చేసి నిర్మాతలకు వినిపించాడు. అదే రన్ రాజా రన్ సినిమా. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. తర్వాత బాహుబలి షూటింగ్ టైంలో సుజిత్‌ను కలిసిన ప్రభాస్, ఆయన చెప్పిన కథకు బాగా ఇంప్రెస్ అయ్యాడు. అదే సాహో. మేకింగ్ పరంగా హాలీవుడ్ రేంజ్‌లో ఉన్న ఈ సినిమా ప్రభాస్ కెరీర్‌లో వన్ ఆఫ్ ది స్టైలిష్ సినిమాగా చెప్పుకోవచ్చు. అయితే ఈ సినిమా టాక్ మిక్స్‌డ్‌గా మారింది. బాలీవుడ్‌లో స్టార్ హీరోలతో సినిమా చేయాలని ప్రయత్నించినా ఆ ఛాన్స్ రాలేదు. తిరిగి టాలీవుడ్‌కి వచ్చాడు.



ఈ సమయంలో చిరంజీవి గాడ్ ఫాదర్ చిత్రాన్ని చేసే ఛాన్స్ దక్కించుకున్నాడు. కానీ అది రీమేక్ కావడంతో సుజిత్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. అదే సమయంలో పవన్ కళ్యాణ్ నుంచి కాల్ వచ్చింది. రీమేక్ వదులుకోవడంతో పవన్ కళ్యాణ్‌తో సినిమా చేసే అవకాశం దక్కింది.ఇలా 2022 నుంచి దాదాపు మూడు ఏళ్లపాటు సుజిత్ డైరెక్ట్ చేసిన సినిమా ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. హీరో పవన్ కళ్యాణ్ అయినా, ఈ సినిమాకి రియల్ హీరో సుజిత్ డైరెక్షన్ అనడంలో సందేహమే లేదు. తమన్ మ్యూజిక్, పవన్ కళ్యాణ్ ఎలివేషన్స్ కూడా ఈ సినిమాకు హిట్ టాక్ రావడానికి ప్రధాన కారణాలు. అందుకే సోషల్ మీడియాలో జనాలు “ఒక రీమేక్ సినిమాను రిజెక్ట్ చేశాడనే కారణంగా సుజిత్‌కి పవన్ కళ్యాణ్‌తో సినిమా చేసే ఛాన్స్ వచ్చింది” అని మాట్లాడుకుంటున్నారు. మొత్తానికి ఇండస్ట్రీలోకి రావాలి అంటే బ్యాక్ గ్రముడ్ కాదు టాలెంట్ ఉండాలి అని ప్రూవ్ చేశాడు ఈ సుజిత్..!

మరింత సమాచారం తెలుసుకోండి: