నాటి తెలుగు చలన చిత్ర రంగానికి క్రొత్త దిశని ఆపాదించి, తరాలు మారినా వన్నె తగ్గని బాక్సాఫిసు ఫార్ములా ని అందించి, అన్నగారి సుధీర్ఘసినీ ప్రస్థానంలో ఒక మైలురాయి గా నిలిచిన చిత్రరాజం "సర్దార్ పాపారాయుడు" (అక్టోబర్ 30, 1980)


"సంగర రంగ విహారులు
శాత్రవదళ సంహారులు
స్వేఛ్చా కంకణధారులు
కవోష్ణ రుధిరోద్గారులు..!!
ఒకరా..ఇద్దరా..వేలూ..లక్షలు..ఉన్నరెందరో ధీరులు...!!"
బుర్ర కథకుల గళం లో నుంచి ఫిరంగి గుళ్ళలా దూసుకొస్తున్న ఆ గీతాన్ని వింటున్న సర్దార్ గుండె ఉప్పొంగి పోతుంది... దేహం లోని అణువణువున దేశమాత దాస్య శృంఖలాలను త్రెంచి వేయాలన్న ఆవేశం కట్టలు తెంచుకోంటోంది. ఎంతో శ్రద్ధాభక్తులతో ఆ వీరగాధను అవధరిస్తూ...మెల్లమెల్లగా మన్నెం వీరుని తన మనోఫలకం లో దృశ్యమానం చేసుకుంటూ..ఉద్విగ్నానికి లోనైన సర్దార్.


బుర్రకథకులు తమ వీరగాధాలాపనను ఆపగానే...ఒక్కసారిగా సింహగర్జన చేస్తూ....వీర అల్లూరి ఘన వారసత్వాన్ని నిలబెట్టేందుకు తామున్నమంటూ.. తన అనుచరగణాన్ని ఉత్తేజితుల్ని చేస్తాడు...ఈ ఒక్క సన్నివేశం "సర్దార్ పాపారాయుడు" చిత్ర ఘనవిజయాన్ని ఖరారు చేసింది. అన్నగారు ఈ బుర్రకథ లో అటు సీతరామరాజుగానూ, ఇటు సర్దార్ పాపారాయుడుగాను జీవించిన తీరు నభూతో..!! అలా మెస్మరైజ్ చేసేశారు ప్రేక్షకలోకాన్ని..!! హాట్సాఫ్ టు నందమూరి..!


విప్లవకారునిగా, సత్యవాదిగా, నిస్వార్థ దేశభక్తునిగా, ఉత్తమ యిల్లాలికి భర్తగా, నమ్మినవారిని కాచుకునే ధీరునిగా, శిష్టరక్షణ, దుష్టశిక్షణ చేసి, కర్తవ్యదీక్షలో విజేతగానిలిచి...వీరమరణం పొందిన ధీరోధాత్తుడుగా పాపారాయుడు పాత్రలోని వివిధకోణాలను ఎంతో ప్రశంసనీయంగా స్పృశించారు అన్నగారు. అటు కర్తవ్యపరాయణత, నిజాయితీ మూర్తీభవించిన పోలీసు అధికారి పాత్రను అలవోకగా నిలబెట్టి...అటు గ్లామర్, ఇటు గ్రామర్ తో చిత్ర ఘనవిజయానికి వెన్నెముకగా నిలిచారు అన్నగారు..!


నిజానికి ఈ చిత్రం లో అన్నగారు ద్విపాత్రాభినయం కాదు..బహుపాత్రాభినయం చేశారు. జైలు నుండి బయటకు రాగానే, రెపరెప లాడుతున్న మువ్వన్నెల పతాకాన్ని చూచి మురిసిపోవడం, రైల్లో  ప్రయాణిస్తూ రేడియో లో వందేమాతర గీతం వింటూ అలాఅలా ఆలోచనలలోకి జారిపోవడం..ఓహ్..అద్భుతం..!  
ఈరోజు అంటే అక్టోబర్, 30 న విడుదలై బ్లాక్ బస్టర్ గా నిలిచిన అపూర్వ చిత్రం "సర్దార్ పాపారాయుడు" అన్నగారి వరుస హిట్లలో మరో సంచలన హిట్.. !

మరింత సమాచారం తెలుసుకోండి: