అమెరికాలోని కాలిఫోర్నియా ప్రజలకు ఇప్పుడు పెద్ద చిక్కచ్చి పడింది. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక వణికిపోతున్నారు. ఉన్నపళంతా తట్టా బుట్టా సర్ధుకుని సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నారు. అక్కడి ప్రభుత్వం కూడా రక్షణ చర్యలను వేగవంతం చేసింది. ఎప్పుడు ఏ ఉపద్రవం ముంచుకొస్తుందోనని కంటి మీద కునుకులేకుండా గడుపుతునారు అక్కడివారు.
అమెరికా ఉత్తర కాలిఫోర్నియాలోని వోవర్ విల్లే వాటర్ డ్యామ్ ప్రమాదం అంచున ఉంది. దీంతో ఉత్తర కాలిఫోర్నియాలోని వేలమంది ప్రజలను ఖాళీ చేయిస్తున్నారు. భారీగా వచ్చిన వరదల కారణంగా ఈ డ్యామ్ పొంగి పొర్లుతోంది. ఇంకోవైపు పెద్ద ఎత్తున వచ్చి చేరుతున్న వరద కారణంగా ఈ డ్యామ్ స్పిల్‌వే ఏ క్షణానైనా బద్దలు కావొచ్చని అధికారులు హెచ్చరిస్తున్నారు. వరద ముప్పు ఉన్న ప్రాంతాల్లోని వారిని అధికారులు తక్షణమే ఖాళీ చేయిస్తున్నారు. ఏళ్ల తరబడి కరవు తర్వాత ఇటీవల కాలిఫోర్నియాలో భారీగా హిమపాతం, వర్షాలు కారణంగా నీరు వచ్చిచేరుతోంది. 50ఏళ్లలో తొలిసారి ఈ డ్యామ్ ప్రమాదకర స్థాయిలో నిండిపోయింది. ఇప్పటికే సెకనుకు లక్ష క్యూబిక్ అడుగుల మేరకు నీటిని స్పిల్‌వే నుంచి వదులుతున్నట్లు అక్కడి అధికారులు చెబుతున్నారు. కానీ భారీగా రాళ్లు ఈ స్పిల్‌వేలో ఉండటంతో నీరు వేగంగా వెళ్లటంలేదని అధికారులు గుర్తించారు.
దీంతో ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయాలని పోలీసులు సామాజిక మాధ్యమంలో పోస్టు చేశారు. దాదాపు 16,000 మందిపై ఈ వరదలు ప్రభావం చూపొచ్చని అంచనా వేస్తున్నారు. వరద ముప్పు ఉన్న ప్రాంతాల్లోని ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. వరద ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో భారతీయులు నివసిస్తున్నట్లు సమాచారం. దీంతో ఇండియాలోని వారి కుటుంబ సభ్యుల్లో ఆందోళన నెలకొంది. అధికారులు సమీప గ్రామాలను ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఆ చుట్టు ప్రక్కల ప్రాంతాల్లో వాహనాలను సైతం నిషేధించారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి