గత నెల 27వ తేదీన హైదరాబాద్ లోని షాద్ నగర్ దగ్గర గల తొండుపల్లి టోల్ గేట్ ప్రాంతంలో లేడీ వెటర్నరీ డాక్టర్ ప్రియాంక రెడ్డి అనే అమ్మాయిని అత్యంత పాశవికంగా రేప్ చేసి, ఆపై ఆమెను ఘోరంగా చంపేసి పెట్రోల్ పోసి కాల్చేసిన నలుగురు నిందితులను ఇటీవల పోలీసులు ఎన్కౌంటర్ చేసి చంపేయడం జరిగింది. కాగా ఈ ఘటనలోని నిందితుల్లో ముగ్గురు, కేవలం 22 ఏళ్ళ లోపు వారు కావడం ఒకింత ఆశ్చర్యకరం. ఇకపోతే ఈ ఘటనతో దేశవ్యాప్తంగా ఉవ్వెత్తున నిరసన జ్వాలలు ఎగసిపడ్డాయి. ప్రజలు సహా పలువురు సినిమా, రాజకీయ ప్రముఖులు సైతం ఈ దారుణాన్ని ప్రతిఘటించారు. 

 

ఇక ప్రజా మరియు మహిళా సంఘాలవారు అయితే, అటువంటి నీచులకు ఘోరమైన శిక్షలు విధిస్తేనే ఇకపై అటువంటి నేరాలు చేసేవారు భయపడతారని డిమాండ్ చేయడం జరిగింది. మొత్తానికి వారు కోరిన విధంగా, అలానే చనిపోయిన ప్రియాంక రెడ్డి కుటుంబ సభ్యుల ఆవేదన మూలంగా ఆ నలుగురు నిందితులకు సరైన శిక్షే పడిందనేది వాస్తవం. అయితే వారు చనిపోయినప్పటికీ, ఆ విధంగా ఇంకా ఆడవారిపై అత్యాచారాలు చేస్తున్నవారు, మరియు చేయాలని భావిస్తున్నవారి రూపంలో బ్రతికి ఉన్నారని అంటున్నారు మహిళా సంఘాల నాయకులు. 

 

సంఘంలో ఆడదానికి రక్షణ లేకుండాపోయిందని, మృగాళ్ల మనసుల్లో నీచమైన ఆలోచనలు పోనంతకాలం వారి రూపంలో చనిపోయిన నిందితులు బ్రతికి ఉన్నట్లేనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి ప్రభుత్వాలు మరియు నాయకులు సరైన రీతిన వ్యవహరించి స్త్రీలకు పూర్తి స్థాయిలో రక్షణ కల్పించగలిగితే రాబోయే కాలంలో ఇటువంటి దురాగతాలు చాలావరకు తగ్గే అవకాశం ఉందని అంటున్నారు. మనిషి యాంత్రికంగా ఈ డిజిటల్ యుగంలో ముందుకు పోవడం అభివృద్ధి  కాదని, ఎప్పుడైతే మానవత్వంతో పరాయి స్త్రీని సోదరి భావంతో మగవాడు చూస్తాడో అప్పుడే దేశం నిజంగా అభివృద్ధి చెందినట్లు అని వారు అభిప్రాయపడుతున్నారు. కావున మనందరం ఇకనైనా మన జన్మకు కారణమై, జీవితంలో సగభాగమైన ఆడవారికి రక్షణగా నిలిచి వారిని గౌరవించి కాపాడుకుందాం....!! 

మరింత సమాచారం తెలుసుకోండి: