వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి మేనమామ, గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ సోదరుడు రవీంద్రనాథ్ రెడ్డికి హైదరాబాద్‌లో షాక్ తగిలింది. హైదరాబాదులోని కృష్ణానగర్‌లో కడప మాజీ మేయర్ అయిన రవీంద్రనాథ్ రెడ్డి భవనాన్ని గ్రేటర్ హైదరాబాద్ నగర పాలక సంస్థ (జిహెచ్ఎంసి) అధికారులు కూల్చివేస్తున్నారు. సొసైటీ స్థలాన్ని అక్రమించుకుని భవనం కట్టారని ఆరోపిస్తూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు జిహెచ్ఎంసి అధికారులు రవీంద్రనాథ్ రెడ్డి భవనాన్ని కూల్చివేసేందుకు పూనుకున్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు బందోబస్తు మధ్య జిహెచ్ఎంసి అధికారులు కూల్చివేత పనులు చేపట్టారు. తాము 1990లో తాము వాచ్‌మన్‌ను పెట్టామని, 2003 వరకు వాచ్‌మన్ ఉన్నాడని, ఆ తర్వాత తాము ఖాళీ చేయాలని అడిగితే చేయలేదని పిటిషనర్ నీరజా రెడ్డి చెప్పారు. తాము కోర్టుకు వెళ్లామని, 2008వరకు కేసు నడిచిందని, జూన్‌లో తీర్పు వచ్చిందని ఆమె చెప్పారు. అయితే 2010లో ఆ స్థలంలో బంగళా కడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, దానిపై తాము జిహెచ్ఎంసికి ఫిర్యాదు చేశామని ఆమె చెప్పారు.  హైకోర్టు ఇచ్చిన తీర్పుపై అపీల్‌కు వెళ్తారని భావించామని, కానీ వెళ్లలేదని ఆమె అన్నారు. తాము ఆక్రమణకు గురైందని ఫిర్యాదు చేయడంతో తమకు వైయస్ జగన్‌నుంచి, రవీంద్రనాథ్ రెడ్డి నుంచి ఫోన్లు వచ్చాయని ఆమె చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: