16 డిసెంబర్ 2012.. అర్ధరాత్రి జరిగిన దారుణ ఉదంతం. ఆ నిశీరాత్రిలో నిర్భయ జీవితం తెల్లారిపోయింది. ఆరుగురు కీచకులు బస్సులోనే ఆ యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. తరువాత అత్యంత పాశవికంగా, హృదయవిదారకంగా రోడ్డుపై వదిలేసి వెళ్లారు. ఆ నాటి ఘటన ఇంకా కళ్లముందే తిరుగుతూ ఉంది. దేశమంతా ఆమెకు జరిగిన అన్యాయంపై గళమెత్తింది. నిందితులకు శిక్షపడాలని డిమాండ్ చేస్తూ రోడ్డెక్కారు. అప్పటి యూపీఏ ప్రభుత్వం వెంటనే నిర్భయ చట్టాన్ని తెచ్చింది. నిందితులకు ఉరి శిక్షను ఖరారు చేశారు. కానీ ఏడేళ్లు గడిచినా నిందితులకు శిక్ష మాత్రం పడలేదు. 

 

షాద్‌నగర్‌లో దిశపై జరిగిన అత్యాచార ఘటన, నిందితుల ఎన్‌కౌంటర్‌తో నిర్భయ నిందితుల ఉరి మరోసారి తెరపైకి వచ్చింది. ఇక ప్ర‌స్తుతం చూస్తున్న ప‌రిస్థితుల బ‌ట్టీ.. నిర్భయ దోషుల ఉరితీత ఇప్పటికిప్పుడు అమలు జరిగే సూచనలు కనిపించడంలేదు. ఇప్పటికే వారిపై జారీ అయిన డెత్ వారెంట్లు రెండుసార్లు వాయిదా పడ్డాయి. దీంతో కేంద్రం సుప్రీంను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. అయితే నిర్భయ దోషులను విడివిడిగా ఉరి తీయాలని కేంద్రం దాఖలు చేసిన పిటిషన్నిసుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మసనం శుక్రవారం విచారించింది. 

 

నిర్భయ దోషులు జాతి సహనాన్ని పరీక్షిస్తున్నారని కోర్టుకు తెలిపిన సోలిసిటర్ జనరల్.. దోషుల న్యాయపరమైన అవకాశాలను వినియోగించుకునే వరకు ఉరిశిక్ష అమలు చేయలేమని అధికారులు చెప్తున్నారని సుప్రీం బెంచ్‌కు వివరించారు. దోషుల్లో ఒకడైన పవన్ గుప్తా రివ్యూ పిటిషన్‌ని 2018లో సుప్రీంకోర్టు కొట్టేసినప్పటి నుంచి ఇప్పటివరకు తనకు ఉన్న ఏ ఒక్క అవకాశాన్ని ఉపయోగించుకోలేదని సోలిసిటర్ జనరల్ కోర్టుకు తెలిపారు. అయితే దోషులను ఒకేసారి ఉరితీయాలన్న నిర్ణయం నేపథ్యంలో పవన్ గుప్తాకు ఇంకా పలు అవకాశాలు మిగిలే ఉన్నాయి. 

 

రాష్ట్రపతిని క్షమాభిక్ష కోరడం, క్యూరేటివ్ పిటిషన్‌ను దాఖలు చేయడం వంటి అవకాశాలు దోషుల్లో ఒకరికి మిగిలే వున్న నేపథ్యంలో మిగిలిన ముగ్గురి ఉరిశిక్షను కూడా అమలు చేయలేని పరిస్థితి నెలకొంది. పవన్ గుప్తా గనక తనకున్న న్యాయపరమైన అవకాశాలను ఇప్పట్లో వినియోగించుకోకపోతే.. వారి ఉరి శిక్ష అమలు ఇప్పట్లో జరిగే అవకాశాలు కనిపించడం లేదు. మ‌రోవైపు నిర్భయ దోషుల ఉరి అమలుకు కొత్త తేదీ ప్రకటించాలంటూ తీహార్ జైలు అధికారులు ఢిల్లీ పాటియాలా హౌస్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 

 
 

మరింత సమాచారం తెలుసుకోండి: