ఎక్మో చికిత్సా విధానం ప్రస్తుతం విస్తృతంగా చర్చలోకి వస్తోంది. వాస్తవానికి ఈ విధానం కొంత కాలంగా భారతదేశంలో అందుబాటులో ఉంది. విదేశాల్లో చాలా విస్తృతంగా వాడకంలో ఉంది ఎక్మో. కీలక ఘడియల్లో మనుషుల ఊపిరితిత్తుల పనినీ, అవసరమైతే గుండె పనిని కూడా బయటే పూర్తిచేసి…మనిషి దేహాన్ని నిలబెట్టే సంక్లిష్టమైన ప్రత్యేక చికిత్సా విధానం ఇది. అందుకే దీనికి ఇంతటి ప్రాధాన్యం ఏర్పడింది.

ప్రస్తుతం చెన్నైలో ప్రముఖ గాయకుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం ఎక్మో చికిత్స తీసుకుంటున్నారు. రోగి శ్వాస పీల్చుకోలేకపోతున్న తరుణంలో…బయటి నుంచి ఆక్సిజన్‌ను ఇచ్చి..రోగిని బతికించే కీలకమైన విధానం వెంటిలేటర్ అమర్చే ప్రక్రియ. రోగి ఊపిరితిత్తులు సరిగా పని చేయక..వెంటిలేటర్‌తో కూడా ఉపయోగం లేని సందర్భాల్లో.. ప్రాణ రక్షణ కోసం అక్కరకొచ్చే అత్యాధునిక విధానమే ఎక్మో.

రక్తం..మన శరీరంలో ప్రతి కణానికీ ప్రాణ వాయువును మోసుకుపోయే అద్భుత శక్తి ప్రవాహం ఇది. అందుకే రక్తం సజావుగా, నిరంతరాయంగా అందుతుంటేనే మన ఒంట్లోని కణాలు, అవయవాలన్నీ సజీవంగా ఉంటూ…వాటి పని అవి సమర్థంగా చేసుకుపోతుంటాయి. ఒకవేళ ఏదైనా కారణం చేత రక్త సరఫరా నిలిచిపోతే..ఆ కణాలు చనిపోతాయి. అవయవాల పనితీరు అస్తవ్యస్తమై క్రమేపీ నిర్జీవమయిపోతాయి.  మృత్యువు ముంచుకొచ్చేస్తుంది. మన శరీరంలో రక్త సరఫరాకు అంతటి కీలకమైన ప్రాధాన్యం ఉంది. ఇంతటి కీలకమైన రక్తాన్ని మన శరీరమంతా సరఫరా చేసేది గుండె. ఈ రక్తాన్ని నిరంతరం శుద్ధి చేస్తుండేది ఊపిరితిత్తులు. అందుకే ఈ రెండింటినీ మనిషి శరీరంలో అత్యంత కీలకమైన అవయవాలుగా చెబుతారు. ఊపిరిత్తిత్తులు సరిగా పని చేయకపోతే రక్త శుద్ధి ప్రక్రియ జరగదు. దీంతో ప్రాణవాయువైన ఆక్సిజన్‌ లేని చెడు రక్తమే ఒళ్లంతా తిరుగుతుంది. ఆక్సిజన్‌ తగినంత అందక అవయవాలన్నీ దెబ్బతింటాయి. అందుకే గుండె, ఊపిరితిత్తులూ..రెండూ సమర్థంగా పనిచేస్తుండటం చాలా అవసరం. ఒకవేళ ఎవరికైనా ఈ రెండూ విఫలమైపోతే అప్పుడు ప్రాణ రక్షణ కోసం ఏం చేయాలి? ఊపిరితిత్తులు చేసే పనినే బయట యంత్రాలతో చేయించే అద్భుతమైన చికిత్సా విధానం..ఇప్పుడు ఎక్మో రూపంలో అందుబాటులోకి వచ్చింది.

రోగి రక్తాన్ని ఒక పైప్ ద్వారా బయటకు తీసుకువస్తారు.  యంత్రంలో దాన్ని శుద్ధి చేసి.. మంచి రక్తాన్ని తిరిగి శరీరంలోకి ఎక్కిస్తుండటం ఈ విధానం ప్రత్యేకత. అంటే ఊపిరితిత్తులు చేసే పనీ, గుండె చేసే పనీ.. రెండింటినీ ఈ యంత్రమే అదీ బయటే చేస్తుంది. ఈ విధానంలో ఒంట్లో అవయవాలేవీ దెబ్బతినే ప్రమాదం ఉండదు. గుండెకు, ఊపిరితిత్తులకు పూర్తి విశ్రాంతి, కోలుకునేంత సమయం ఇవ్వటం దీనిలోని ముఖ్య సూత్రం. ఇప్పుడిప్పుడే ఎక్మో మన దేశంలో ప్రాచుర్యంలోకి వస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: