న్యూఢిల్లీ: రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం ఓ సరికొత్త పథకాన్ని తీసుకొచ్చింది. వారికి అవసరమైన వ్యవసాయ పనిముట్లన్నీ ప్రభుత్వమే అద్దెకిచ్చేలా ఈ పథకాన్ని రూపొందించింది. నేషనల్‌ రూరల్‌ లైవ్లీహుడ్‌ మెషీన్‌ స్కీమ్ ద్వారా అనేక ప్రాంతాల్లో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేస్తోంది. ప్రధానంగా మహిళలకు ఉపాధి కల్పించేందుకు, సన్నకారు రైతులకు సాయం చేసేందుకు సెంట్రల్‌ గవర్నమెంట్‌ ఈ సెంటర్లను ఏర్పాటు చేస్తోంది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా ఇలాంటి కేంద్రాలను వెయ్యికి పైగా ఏర్పాటు చేసేందుకు కేంద్ర గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ సెంటర్లు డిస్ట్రిక్‌ రూరల్‌ డెవలప్‌మెంట్ ఏజెన్సీ (డీఆర్డీఏ) ఆధ్వర్యంలో పనిచేస్తాయని, వారి ద్వారానే రైతులకు తక్కువ ధరలకే పనిముట్లను అందజేయడం జరగుతుందని కేంద్రం చెబుతోంది. ఈ కేంద్రాల్లో కొన్ని తెలంగాణ జిల్లాల్లో కూడా ఏర్పాటు చేయనున్నారు. రాష్ట్రంలో జిల్లాకు ఒకటి చొప్పున వీటిని ఏర్పాటు చేస్తున్నారు.

ఆయా జిల్లాల్లో ఉండే జిల్లా కలెక్టర్ ప్రెసిడెంట్‌గా ఉండే ‘డిస్ట్రిక్ట్ పర్చేజింగ్ కమిటీ’ రైతులకు ఉపయోగపడే అత్యాధునిక వ్యవసాయ పరికరాలు కొనేందుకు కావాల్సిన నగదును అందిస్తుంది. ‘కస్టమ్ హైరింగ్ సెంటర్’కు ట్రాక్టర్, ట్రాలీ, రోటవేటర్, కల్టివేటర్, ఫ్లవ్, ప్యాడి బేటర్, మేజ్ షెల్లర్ లాంటి పనిముట్లను ఈ సెంటర్ ద్వారా అధికారులు అందించనున్నారు. పంటలకు మందులు స్ర్పే చేసే మెషీన్లు కూడా అందుబాటులో ఉంచనున్నారు. సెల్ఫ్ హెల్ఫ్ గ్రూప్ సభ్యులు హార్వెస్టర్, మినీ రైస్ మిల్లు లాంటి మెషీన్లు కావాలని తీర్మానాలు చేస్తే అవి కూడా కొనివ్వడం జరుగుతుందని చెబుతున్నారు.

పనిముట్లు కొనలేకపోవడం, కూలీలు దొరక్కపోవడం వంటి సమస్యలతోనే రైతులు అత్యధికంగా ఇబ్బందులు పడుతుంటారని, అయితే వాటిలో పనిముట్ల సమస్యను దూరం చేసేందుకే ఈ పథకాన్ని తీసుకొచ్చినట్లు కేంద్రం చెబుతోంది. కౌలు రైతులు, చిన్న, సన్నకారు రైతుల కోసం ఈ సెంటర్లు ఎంతగానో ఉపయోగపడతాయని కేంద్ర సర్కార్ ధీమా వ్యక్తం చేస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: