ఏదైనా మన దగ్గర అవసరమైంది, విలువైంది, తక్కువగా ఉంటే ఏం చేస్తాం.. జాగ్రత్తగా వాడుకుంటాం.. దుబారా తగ్గించేస్తాం.. మరి తెలంగాణ అధికారులు మాత్రం ఈ విషయంలో ఆలస్యంగా మేలుకున్నారు. అసలే విభజన కారణంగా కరెంటు కష్టాలు వస్తాయని ముందే తెలిసినా.. ఆ దాందేముంది.. అని తేలిగ్గా తీసుకున్నవారు.. ఇప్పుడు వరుసగా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే మేలుకున్నారు. దుబారా తగ్గించాలని నిర్ణయించారు. రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ వృథా అవుతున్న తీరుపై ప్రత్యేకంగా నివేదిక తెప్పించుకున్న తెలంగాణ ప్రభుత్వం... దీన్ని అరికట్టకపోతే రానున్న వేసవిలో విద్యుత్ సరఫరా సమస్య మరింత తీవ్రమవుతుందని భావిస్తోంది. కిందిస్థాయి అధికారులు సైతం కార్యాలయాల్లో ఏసీలు వినియోనియోగించడంపై తెలంగాణ పాలకులు గుర్రుగా ఉన్నారు. వీరిపై కొరడా ఝలిపించనున్నారు. కార్యదర్శి స్థాయికంటే తక్కువ హోదాకలిగిన అధికారుల కార్యాలయాల్లో ఉన్న ఏసీలు తొలగించాలని ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో విద్యుత్ అందుబాటు పెరగడంతో వారానికి రెండు రోజుల పారిశ్రామిక విద్యుత్ కోతలను ఒక రోజుకే పరిమితం చేసింది. నీలోఫర్ తుపాను ప్రభావంతో రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు కనిష్టస్థాయికి దిగిరావడంతో వ్యవసాయ, గృహ విద్యుత్ వినియోగం ఒక్కసారిగా తగ్గిపోయింది. మూడు రోజులుగా డిమాండ్, సరఫరాలు సమానంగా ఉండటంతో డిస్కంలు గృహ విద్యుత్ ను కూడా పూర్తిస్థాయిలో సరఫరా చేస్తున్నాయి. తాత్కాలికంగా గృహ విద్యుత్ కోతలను ఎత్తివేశారు. ప్రస్తుతం పరిస్థితి బాగానే ఉన్నా.. పొదుపుగా విద్యుత్ వాడితే ఎప్పటికీ మేలేనని భావిస్తున్న సర్కారు.. ఉద్యమంలా దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆలోచిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: