గ‌త పక్షం రోజులుగా 25 వేల మంది విద్యుత్‌ కాంట్రాక్ట్‌ కార్మికులు తమకు ఉద్యోగ భద్రత‌, ప్రభుత్వనెరుగా వేతనం చెల్లించాలని, దశల వారీగా  శాశ్వత ఉద్యోగులుగా గుర్తించాల‌ని ఉద్యమం చేస్తున్నారు. ఇందులో కాంట్రాక్ట్‌ పద్ధతి ద్వారా నియమించే విధానాన్ని రద్దు చేయాలనే డిమాండే ప్రధానంగా విన‌బ‌డుతోంది. వీరిలో కొందరు 15, 20 ఏళ్ళుగా పనిచేస్తున్నారు. వీరి వేతనాలు ఏడు వేల నుంచి తొమ్మిది వేలు మాత్రమే ఉంటాయి. ఈ వేతనంలో కూడా కాంట్రాక్టర్లు కొంత తింటారు. కాంట్రాక్టర్లకు ప్రభుత్వం ప్రతి ఉద్యోగి పేర కమీషన్‌ ఇస్తుంది.


 ఇచ్చే వేతన ధనాన్ని కార్మికులకు నేరుగా ఇవ్వకుండా 


ప్రభుత్వం ఇచ్చే వేతన ధనాన్ని కార్మికులకు నేరుగా ఇవ్వకుండా ఆ డబ్బును వడ్డీకి ఇచ్చి మూడు, నాలుగు నెలల తర్వాత కార్మికుడికి ఇవ్వడం కూడా జరుగుతుంటుంది. ఈ కాంట్రాక్టర్లెవ్వరూ విద్యుత్‌ రంగంతో సంబంధం ఉన్నవాళ్ళు కారు. వాళ్ళకుండే అర్హతలు కూడా ఏమీ లేవు. కాంట్రాక్టర్ల కు అధికారంలో ఉన్న వాళ్ళతో సంబంధాలుండడం వలన, నెలనెలా లక్షలాది రూపాయలు కమీషన్‌గా తీసుకుంటున్నారు. ఈ పద్ధతి ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడి హయాంలో ప్రపంచ బ్యాంకు ఆదేశాల మేరకు ప్రవేశపెట్టబడింది. దీని లక్ష్యం కార్మికుడికి ఎలాంటి హక్కులు లేకుండా ప్రభుత్వానికి ఏ ఇబ్బంది లేకుండా, ఎంత కాలం పనిచేసినా పర్మినెంట్‌ చేయమని అడిగే హక్కు లేకుండా చేసారు.


నిజానికి తెలంగాణ ఉద్యమంలో తమ సమస్య


ఇక విద్యుత్‌ కార్మికుల సమ్మెకు వస్తే.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాతా లేదా తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం జరుగుతున్న కాలంలో కొంత సంఘటితమయ్యారు. ఉద్యమంలో ఇతర ప్రభుత్వోద్యోగులలాగే చురుకుగా పాల్గొన్నారు. వేలాది సంఖ్యలో సమావేశాలకు హాజరై వాటిని విజయవంతం చేశారు. నిజానికి తెలంగాణ ఉద్యమంలో తమ సమస్యకు ఒక పరిష్కారం ఉన్నదని భావించారు. రాష్ట్రం వచ్చిన తర్వాత మొదటి మూడు నెలలలోపే జరిగిన సమ్మె విద్యుత్‌ కార్మికులదే. ప్రభుత్వం వాళ్ళ సమస్యను పరిశీలించడానికి ప్రభాకరరావు కమిటీ వేసింది. ప్రభాకరరావు మీద కార్మికులకి విపరీతమైన విశ్వాసం ఉంది. కమిటీ ఏడు నెలలు తీసుకొన్నా ఓపికగానే ఎదురు చూశారు. ఈ కమిటీ చేసిన కొన్ని సూచనలు కార్మికులకు కొంచెం ఊరట కల్పించినా, కాంట్రాక్ట్‌ వ్యవస్థ రద్దు మీద కమిటీ స్పష్టంగా సూచన చేయకపోవడం కార్మికులను చాలా నిరాశపరచింది. దీంతో మళ్ళీ పెద్ద ఎత్తున సమ్మెకు దిగారు.

కాంగ్రెస్‌ పార్టీ ఓటమికి ప్రధాన కారణం 


ఇన్నిరోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం వాళ్ళ ప్రధాన డిమాండ్‌ల గురించి సీరియస్‌గా ఆలోచిస్తున్నట్లు కాని, ఈ వ్యవస్థ రద్దుపై చర్యలు తీసుకునే దిశగా పోతున్నట్లు కాని అనిపించదు. ఆ విషయంలో బాధ్యత కలిగిన మంత్రులు కాని, అధికారులు కాని ఆలోచిస్తున్నట్టుగా లేదా విధానపర నిర్ణయాలు తీసుకునే దృఢత్వం కనిపించడం లేదు. కాంట్రాక్ట్‌ నియామక విధానం ఒక దుర్మార్గమైన అభివృద్ధి నమూనా నుంచి పుట్టింది. తెలంగాణ ప్రజా ఉద్యమం లో ఈ విధానానికి వ్యతిరేకంగా జరిగింది. 2004లో చంద్రబాబు ఓటమి, 2014లో కాంగ్రెస్‌ పార్టీ ఓటమికి ప్రధాన కారణం ఈ ప్రజా వ్యతిరేక విధానమే. బీజేపీ అదే నమూనాని మరింత వేగవంతంగా ముందుకు తీసుకెళ్ళడంతో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా విధానాన్ని మార్చే రాజకీయాలు కరువయ్యాయి. 


కొత్త‌ ఆర్థిక విధానాన్ని నిర్దయగా ఈ దేశం మీద రుద్దిన చిదంబరం, మన్మోహన్‌ సింగ్‌ అడ్రస్‌ లేకుండా పోయారు. వాళ్ళెవరికి ప్రజల దగ్గరకు రావడానికి మొఖం చెల్లడం లేదు. ఈ తప్పు తెలంగాణ ప్రభుత్వం చేయకూడదు. అభివృద్ధికి అంతిమ ప్రమాణం ‘మనిషి’. అభివృద్ధి మనిషి జీవితం బాగుపడడానికి కాని మనిషే అభివృద్ధి కొరకు కాదు. ఎంత సంపద సృష్టించినా ఎంతమంది జీవితాలు బాగుపడ్డాయి అన్నది కదా ప్రమాణం. తెలంగాణ ప్రభుత్వం 25 వేల కుటుంబాల సమస్యను విస్మరించడమేమిటో? అప్రజాస్వామికమైన ఒక పద్ధతి మీద ఎందుకు పునరాలోచించడం లేదు అనేది ప్రశ్న.

తెలంగాణలో ప్రభుత్వోద్యోగుల జీతభత్యాలు గణనీయంగా పెరిగాయి


ఇక సంఘటిత ఉద్యోగులు, కార్మికులు తమతో పనిచేస్తున్న వేలాది మంది గురించి ఆలోచించడం మానేసారు. తెలంగాణలో ప్రభుత్వోద్యోగుల జీతభత్యాలు గణనీయంగా పెరిగాయి. దీంతోబాటు తమ పక్క అసంఘటిత కార్మికుడి జీవితం గురించి కొంచెమైనా ఆలోచించాలి కదా. వాళ్ల పట్ల సానుభూతి, సంఘీభావం ఎందుకు కొరవడ్డాయి? మనం మానవీయ స్పందనను కోల్పోతున్నాం. ఇక మీడియాను చూస్తే ఆర్‌టీసీ కార్మికుల సమ్మె గురించి మొదటి పేజీలో ప్రచురించిన వార్తా పత్రికలు, పదిరోజులుగా వేలాది మంది కార్మికుల సమ్మె గురించి ఎందుకు పట్టించుకోవడం లేదు? నోరున్న వాళ్ళకే పలుకనైతే నోరులేని వాళ్ళ సంగతేమిటి?


ఔట్‌ సోర్సింగ్‌ విధానాల రద్దు ఒక ప్రధాన భాగం కావాలి.


ఏదిఏమైనా తెలంగాణ పునర్‌ నిర్మాణంలో కాంట్రాక్ట్‌ వ్యవస్థ, ఔట్‌ సోర్సింగ్‌ విధానాల రద్దు ఒక ప్రధాన భాగం కావాలి. నిజానికి ఈ కార్మికులు పోయిన ఎన్నికలలో ఉద్యమ పార్టీ అని టీఆర్ఎస్ గడప గడప తిరిగి ప్రచారం చేసారు. ఎన్నో ఆశలు పెట్టుకున్న ఈ వర్గాన్ని విస్మరించడం తెలంగాణ భవిష్యత్తుకు మంచిది కాదు.


మరింత సమాచారం తెలుసుకోండి: