
పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గం....తెలుగుదేశం పార్టీకి కంచుకోట. ఆ పార్టీ ఆవిర్భావం నుంచి వేరే పార్టీ గెలిచింది ఇక్కడ రెండు సార్లు మాత్రమే. 1983 నుంచి 2019 వరకు జరిగిన 9 ఎన్నికల్లో 7 సార్లు టీడీపీనే గెలిచింది. ఇక 1999లో ఒకసారి కాంగ్రెస్ విజయం సాధించింది. అయితే 2019 నుంచి కొవ్వూరు వైసీపీ కంచుకోటగా మారిపోయిందనే చెప్పొచ్చు.
జగన్ వేవ్‌లో 2019 ఎన్నికల్లో కొవ్వూరు నుంచి తానేటి వనిత విజయం సాధించి, జగన్ కేబినెట్‌లో మంత్రిగా కొనసాగుతున్నారు. అయితే ఇక్కడ వైసీపీ పరిస్తితి మెరుగ్గా ఉంటే, టీడీపీ పరిస్తితి మరీ ఘోరంగా ఉంది. ఇక్కడ టీడీపీని నడిపించే నాయకుడే లేకుండా పోయాడు. 2014లో టీడీపీ నుంచి గెలిచిన జవహర్, చంద్రబాబు కేబినెట్‌లో మంత్రిగా పనిచేసిన విషయం తెలిసిందే.
అయితే జవహర్ మంత్రి అయ్యాక నియోజకవర్గంలో పెత్తనం పెరిగింది. సొంత పార్టీ నేతలే జవహర్‌పై ఎదురు తిరిగే పరిస్తితి వచ్చింది. జవహర్ మంత్రి పదవిలో ఉన్న సమయంలో పార్టీలో ఉన్న దళితులకే సమస్యగా మారారని పెద్ద ఎత్తున నిరసనలు వినిపించాయి. స్వయంగా అధినేత చంద్రబాబుకు కూడా ఫిర్యాదులు వెళ్లాయి. దీంతో 2019 ఎన్నికల్లో జవహర్‌ని అక్కడి నుంచి తప్పించి చంద్రబాబు ఆ సీటును అనితకు ఇచ్చారు.
ఇక జవహర్ కృష్ణాజిల్లా తిరువూరు నుంచి పోటీ చేశారు. అయితే ఈ రెండు చోట్ల టీడీపీ ఓడిపోయింది. పైగా టీడీపీ అధికారం కూడా కోల్పోయింది. ఈ క్రమంలోనే అనితని మళ్ళీ తన సొంత నియోజకవర్గం పాయకరావుపేటకు పంపించేశారు. కానీ కొవ్వూరులో ఇన్‌చార్జ్ పెట్టలేదు. అయితే జవహర్‌ని రాజమండ్రి పార్లమెంటరీ అధ్యక్షుడుగా పెట్టారు. కొవ్వూరు నియోజకవర్గం రాజమండ్రి పార్లమెంట్‌లోనే ఉంది. దీంతో జవహర్ మళ్ళీ కొవ్వూరులో సెట్ అవ్వాలని చూస్తున్నారు. కానీ ఇక్కడున్న జవహర్ వ్యతిరేక వర్గం మాత్రం ఒప్పుకోవడం లేదు. మరి చూడాలి కంచుకోటని నడిపించే నాయకుడు ఎవరో?