మాజీ మంత్రి, తెరాస ఎమ్మెల్యే ఈట‌ల రాజేంద‌ర్‌ను హుజురాబాద్ నియోజ‌క‌వ‌ర్గంలో ఒంట‌రిని చేసేందుకు ప‌క్కా వ్యూహంతో తెరాస అధిష్టానం ముందుకెళ్తుంది. ఈట‌ల మంత్రి వ‌ర్గం నుంచి బ‌ర్త‌ర‌ఫ్ అయిన నాటినుండే నియోజ‌క‌వ‌ర్గంపై మంత్రి గంగుల దృష్టిసారించారు. సీఎం కేసీఆర్ సూచ‌న‌ల‌తో తెరాస ముఖ్య‌నేత‌ల‌ను ఈట‌ల‌కు దూరం చేస్తూ వ‌స్తున్నారు. తాజాగా మంత్రి హ‌రీష్‌రావు సైతం రంగంలోకి దిగ‌డంతో ఈట‌ల వ‌ర్గీయులుగా ముద్ర‌ప‌డిన వారుసైతం కేసీఆర్ నిర్ణ‌య‌మే శిరోధార్యం అంటున్నారు. ఈట‌ల‌ను అన్నిర‌కాలుగా ఇబ్బందుల్లోకి నెట్టేందుకు కేసీఆర్ ప్ర‌య‌త్నిస్తున్న‌ప్ప‌టికీ ఆయ‌న మాత్రం అంతిమ విజ‌యం త‌న‌దేన‌న్న ధీమాతో ఉన్నారు.

ఈట‌ల రాజేంద‌ర్ కీల‌క నిర్ణ‌యం తీసుకోబోతున్న‌ట్లు తెలుస్తోంది. జూన్ 2న ఆయ‌న ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేస్తార‌ని ప్ర‌చారం సాగుతుంది. ఈ మేర‌కు ఆయ‌న అనుచ‌రుల వ‌ద్ద ఈ విష‌యాన్ని ప్ర‌స్తావించార‌ట‌. ఒక‌వేళ ఆయ‌న రాజీనామా చేస్తే ఉప ఎన్నిక అనివార్యం. ఇదే స‌మ‌యంలో ఇన్నాళ్లు ఈట‌ల వెంట ఉన్న తెరాస నేత‌లు కేసీఆర్ నిర్ణ‌య‌మే శిరోధార్యం అంటున్నారు. మ‌రి ఈట‌ల ఉప ఎన్నిక‌లో ఎలా గెలుస్తార‌న్న‌ది ప్ర‌శ్నార్థ‌క‌మే. ఆయ‌న మాత్రం గెలుపుపై అనుచ‌రుల వ‌ద్ద ధీమాతో ఉన్నార‌ని తెలుస్తోంది. తెరాస నేత‌లు త‌న‌కు మ‌ద్ద‌తు తెల‌ప‌క పోయినా నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌లు త‌న‌వెంటే ఉంటార‌ని ఈట‌ల బ‌లంగా న‌మ్ముతున్నార‌ట‌. మ‌రోవైపు బీజేపీ, కాంగ్రెస్‌లుసైతం మ‌ద్ద‌తు ఇస్తాయ‌న్న భావ‌నలో ఈట‌ల ఉన్న‌ట్లు తెలుస్తోంది.

ఈట‌ల రాజేంద‌ర్ బీజేపీలో చేరుతార‌న్న ప్ర‌చారం సాగుతుంది. ఇప్ప‌టికే ఆ పార్టీ ముఖ్య‌నేత‌ల‌తో భేటీ అయ్యారు. ఈట‌ల చేరిక‌కు ముహూర్తంసైతం ఖ‌రారైన‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. ఈ విష‌య‌మై నియోజ‌క‌వ‌ర్గంలోని త‌న అనుచ‌రులతో ఈట‌ల స‌మావేశమై చ‌ర్చించిన‌ట్లు స‌మాచారం. ఒక‌వేళ ఈట‌ల బీజేపీలోకి వెళ్ల‌క‌పోయినా హుజురాబాద్ నియోజ‌క‌వ‌ర్గంలో ఇండిపెండెంట్‌గా బ‌రిలో నిలిస్తే బీజేపీ మ‌ద్ద‌తు త‌న‌కే ఉంటుంద‌న్న ధీమాతో ఈట‌ల ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఎలాగైనా సీఎం కేసీఆర్‌ను ధీటుగా ఎదుర్కొని గ‌ట్టి గుణ‌పాఠం చెప్పాల‌న్న ప‌ట్టుద‌ల‌తో ఈట‌ల ఉన్నారు. మ‌రి ఈట‌ల ప‌ట్టుద‌ల ఏమేర‌కు నెర‌వేరుతుందో వేచిచూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: