తెలంగాణ ఉద్యమ ఫలితం మలిదశలో వచ్చినా.. తొలి దశ ఉద్యమం గురించి తక్కువచేసి చెప్పలేం. అసలు ప్రత్యేక తెలంగాణకు బీజం పడింది, తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున లేచింది తొలిదశలోనే. 1969లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి బీజం పడింది. పాల్వంచ థర్మల్ పవర్ స్టేషన్లో ఉద్యోగుల మధ్య ఆంధ్ర, తెలంగాణ అనే భేదభావం ఏర్పడింది. మెజార్టీ ఉద్యోగులు ఆంధ్రాప్రాంతం వారు కావడంతో.. తెలంగాణ ఉద్యోగులు నిరసనకు దిగారు. తెలంగాణేతర ఉద్యోగుల్ని వెనక్కి పంపి ఆ స్థానాల్లో స్థానికులకు అవకాశం ఇవ్వాలని తీర్మానాలు చేశారు. జనవరి 10న ఈ ఉద్యమం ఖమ్మం నుంచి నిజామాబాద్‌ కి కూడా పాకింది. ఈ క్రమంలోనే ఉద్యమంలోకి ఉస్మానియా యూనివర్శిటీ విద్యార్థులు కూడా చేరారు.

'తెలంగాణ విద్యార్థుల కార్యాచరణ సమితి' కి ఉస్మానియాలోనే బీజం పడింది. 1969, జనవరి 13న ఉస్మానియా యూనివర్సిటీలో 'కార్యాచరణ సమితి' ఏర్పాటైంది. ప్రత్యేక తెలంగాణ సాధనే లక్ష్యంగా కార్యాచరణ సమితి ఏర్పాటు చేసిన విద్యార్థులు మెడికల్‌ స్టూడెంట్ మల్లికార్జున్‌ ను ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకున్నారు. విద్యార్థులు ఎలాంటి త్యాగాలకైనా సిద్ధం కావాని పిలుపునిచ్చిన మల్లికార్జున్.. జనవరి 13న తెలంగాణ వాదులందరితో కలసి సమావేశం ఏర్పాటు చేశారు. ఆ సమావేశంలో ద్వారానే తెలంగాణ పరిరక్షణ కమిటీ ఏర్పాటైంది. ఓవైపు స్టూడెంట్ జేఏసీ, మరోవైపు నగర ప్రముఖులతో ఏర్పాటైన తెలంగాణ పరిరక్షణ కమిటీ రెండూ సమన్వయంతో పనిచేయాలని, తెలంగాణ హక్కులకోసం ఎంతటి త్యాగాలకైనా వెనకాడకూడదని తీర్మానించారు.

ఉస్మానియాలో మొదలైన తెలంగాణ ఉద్యమం సెగ కేంద్రానికి కూడా తాకింది. ఉద్యమ ఉధృతిని గమనించిన కేంద్ర ప్రభుత్వం తెలంగాణ మిగుల నిధు లెక్కలు తేల్చడానికి జస్టిస్‌ భార్గవ అధ్యక్షతన ఒక కమిటీని వేసింది. ముల్కీ నిబంధనలు అమలు చేస్తామని చెప్పింది. అయితే హామీల అమలులో కమిటీ విఫలం కావడంతో.. తెలంగాణలో మళ్లీ ఆందోళనలు చెలరేగాయి. జనవరి 24న సదాశివపేటలో జరిగిన కాల్పుల్లో 14 మంది గాయపడ్డారు. ఈ కాల్పులకు నిరసనగా కొండా లక్ష్మణ్ బాపూజీ తన మంత్రి పదవికి రాజీనామా చేసి, ప్రత్యేక తెలంగాణ కాంగ్రెస్‌ సమితి ఏర్పాటు చేశారు.

తెలంగాణ ఉద్యమం బలపడుతున్న క్రమంలో అప్పటి ప్రధాని మంత్రి ఇందిరాగాంధీ హైదరాబాద్‌ నగరానికి వచ్చి విద్యార్థి నాయకులు, తెలంగాణ ప్రజా సమితి నాయకులతో చర్చలు జరిపారు. ఆ తర్వాత మరికొన్నాళ్లు విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనల్లో పాల్గొన్నారు. చివరకు సెప్టెంబరులో మర్రి చెన్నారెడ్డి ఢిల్లీలో జరిపిన చర్చల వల్ల విద్యార్థి నాయకులు ఉద్యమానికి దూరమయ్యారు. విద్యార్థి సంఘం నాయకుడు మల్లికార్జున్‌ గౌడ్‌ తోనే ప్రకటన ఇప్పించడం ద్వారా ఆ వ్యవహారం అక్కడితో ఆగిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: