ఫిలిప్పీన్స్ లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. సైనిక విమానం సి-130 హెర్క్యూలస్ కూలిపోయింది. జోలో విమానాశ్రయంలో దిగేందుకు ప్రయత్నిస్తూ.. రన్ వే పైకి వస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. ప్రమాద సమయంలో విమానంలో 92మంది ప్రయాణీకులున్నారు. జోలో ద్వీపానికి సమీపంలో ఈ ఘటన జరిగింది. ఈ ఉదయ11గంటల 30నిమిషాలకు విమాన ప్రమాదం జరిగింది.

శిక్షణ పూర్తి చేసుకున్న సైనికులను విమానం దక్షిణ ద్వీపమైన మిండానావోలోని కాగయాన్ డి ఓరో నుండి దళాలను తీసుకువెళుతుండగా ఈ ఘటన జరిగింది. కూలిన వెంటనే విమానానికి మంటలు అంటుకున్నాయి. దీంతో కొందరు ఆ శిథిలాల్లోనే కాలిపోయినట్టు సమాచారం. పదిహేడు మృతదేహాలు లభించాయి. 40 మంది ప్రాణాలతో బయటపడ్డారు. గాయపడిన వారిని సైనిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మిగతా వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

ప్రమాదానికి గురైన సి-130 విమానంలో ప్రయాణించిన సిబ్బంది ఇటీవల ట్రైనింగ్ కూడా పూర్తి చేసుకున్నారు. వారిని ఉగ్రవాద పోరుకు సిద్ధం చేశారు. అంతేకాదు విమానంలో ముగ్గురు పైలట్లు, ఐదుగురు సిబ్బంది కూడా ఉన్నారు. విమానం కూలిన ప్రదేశమైన జోలో ద్వీపంలో టెర్రరిస్టులు ఎక్కువగా మనుగడ సాగిస్తుంటారు.  విమానంపై దాడి జరిగినట్టు ఎలాంటి సంకేతాలు లేవనీ.. సహాయక చర్యలు పూర్తయిన తర్వాత ఈ సంఘటనపై సమగ్ర దర్యాప్తు చేస్తున్నట్టు అక్కడి అధికారులు వెల్లడించారు.


మొత్తానికి ఫిలిప్పీన్స్ లో విమాన ప్రమాదం ఆ దేశవాసులను ఆందోళనకు గురిచేసింది. ఉగ్రవాద కార్యకలాపాలపై యుద్ధం సాగించేందుకు సిద్ధమైన సైనికులను పోగొట్టుకోవడంపై అక్కడి వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు. ఎన్నో ఆశలతో సైనిక రంగంలో అడుగుపెట్టి.. మధ్యలోనే ప్రాణాలు కోల్పోవడం ప్రతీ ఒక్కరినీ ఆవేదనకు గురిచేస్తోంది. ఫిలిప్పిన్స్ లో ఉగ్రవాద కార్యకలాపాలను అంతం చేసేందుకు ఫిలిప్పిన్స్ దేశం తీవ్రంగా కృషి చేస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: