ఎన్నాళ్లో వేచిన కల ఈసారి జరికే 75వ స్వాతంత్ర్య దినోత్సవాన సాకారం కాబోతోంది. జమ్మూకశ్మీర్‌ శ్రీనగర్‌లోని లాక్‌ చౌక్‌లో ప్రతియేటా పంద్రాగస్టున పాకిస్థాన్‌ జెండా ఎగిరేది. అయితే అక్కడ ఈసారి మన భారత పతాకం ఆవిష్కృతం కానుంది. దీంతో యావత్‌ భారతావనిలో జరుగుతున్న 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో.. అక్కడ ఎగురనున్న త్రివర్ణ పతాకం ప్రత్యేకంగా నిలువనుంది.

"ఏక్ దేశ్ మే దో విధాన్, దో నిషాన్ నహీ చలేగీ, నహీ చలేగీ..." ఇది భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపకులలో ఒకరైన శ్యాంప్రసాద్ ముఖర్జీ నినాదం. కశ్మీర్‌లోకి అడుగు పెట్టడానికి ప్రత్యేక అనుమతులు తీసుకోవడాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. అంతేకాకుండా కాకుండా కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని, సెక్షన్ 35ని రద్దు చేయాలని ఆయనే మొదట డిమాండ్ చేశారు. బీజేపీ రెండోసారి అధికారంలోకి వచ్చిన వెంటనే 2019 ఆగస్టు 5న శ్యాంప్రసాద్ ముఖర్జీ కలలను నిజం చేశారు. హోంశాఖ మంత్రి అమిత్‌షా పార్లమెంటులో ఆర్టికల్ 370 రద్దు బిల్లును పెట్టడమే కాకుండా జమ్మూకశ్మీర్‌కు రాష్ట్ర హోదాను కూడా రద్దు చేశారు. లడఖ్‌, జమ్మూ కశ్మర్‌లను కేంద్ర పాలిత ప్రాంతాలుగా మార్చివేశారు. జమ్మూకశ్మీర్ పట్ల శ్యాంప్రసాద్ ముఖర్జీ కన్న కలల్ని నిజం చేయడమే కాకుండా ఆయన ఆశయాల మేరకు శ్రీనగర్‌లోని లాల్ చౌక్ వద్ద త్రివర్ణ పతాకాన్ని ఈసారి పంద్రాగస్టున ఘనంగా ఎగురవేయడానికి అన్ని ఏర్పాట్లు చేశారు.

నిజానికి ఎర్రకోటపై భారత ప్రధాని త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి ప్రసంగిస్తున్న ప్రతిసారీ.. లాల్‌చౌక్‌లో పాకిస్థాన్‌ జెండా రెపరెపలాడేది. పాకిస్థాన్‌ సానుభూతి పరులు, వేర్పాటువాదుల మద్దతుతో ఈ తంతు ప్రతియేటా జరుగుతుండేది. భారత బలగాలతో భారీ బందోబస్తు ఏర్పాటు చేసినా పాకిస్థాన్‌ జెండాను అడ్డుకోవడం ఎవరికీ సాధ్యమయ్యేది కాదు. భారతీయ జనతాపార్టీ నేతలు వాజ్ పేయి, మురళీమనోహర్, అద్వానీ, సుష్మా స్వరాజ్, ఉమాభారతి లాంటి నేతలు లాల్‌ చాక్‌లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయడానికి విఫలయత్నం చేశారు. పాకిస్థాన్‌ జెండాను తొలగించి భారత జాతీయ పతాకాన్ని ఎగుర వేయడానికి భారతీయులు అష్టకష్టాలు పడాల్సి వచ్చేది. అలాంటి లాల్ చౌక్‌లో ఈసారి పంద్రాగస్టున పాకిస్థాన్ జెండాకు బదులుగా త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయడానికి భారత ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. లాల్‌చౌక్ వద్ద ఉన్న గడియారం స్తంభానికి మువ్వన్నెల రంగులు అద్దారు. మూడు వర్ణాలు వెలుగులు విరజిమ్మేలా విద్యుద్దీపాలను అలంకరించారు. లాల్ చౌక్‌లో త్రివర్ణ పతాకం వెనుక అనేక భావోద్వేగ సంఘటనలు చోటుచేసుకున్నాయి. అందుకే ఈసారి కశ్మీర్లో 75 సంవత్సరాల స్వతంత్ర దినోత్సవ వేడుకలను  భారతీయ జనతాపార్టీ నేతలు ప్రత్యేకంగా భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: