తెలంగాణలో రాజన్న రాజ్యం తీసుకొస్తానంటూ వైఎస్ షర్మిల పార్టీ పెట్టింది. ఒంటరిగా పార్టీని స్థాపించి.. అధికార పార్టీకి ఎదురొడ్డి పాదయాత్ర కూడా చేస్తోంది. తనపై అధికార టీఆర్ఎస్ ఎన్ని విమర్శలు చేస్తున్నా.. మౌనంగానే భరిస్తూ ముందుకెళ్తోంది. అయితే షర్మిల తెలంగాణలో రాజకీయ పార్టీ పెట్టడం, ఆమె కుటుంబసభ్యులకు ఇష్టం లేదని మొదట ప్రచారం జరిగింది. ఏపీ సీఎం జగన్ కు సోదరిగా ఉంటూ, తెలంగాణాలో పార్టీ పెట్టడం ఏమిటని కూడా కొందరు సొంత పార్టీ నేతలే అప్పట్లో విమర్శించారు. దీంతో కొన్నాళ్లపాటూ జగన్ కూ, షర్మిలకు మధ్యన మాటలు కూడా లేవని చెప్పుకున్నారు. అప్పట్లో జగన్ సొంత మీడియా సాక్షిలో కూడా షర్మిల గురించి పెద్దగా వార్తలొచ్చేవి కావు.

అయితే ప్రస్తుతం షర్మిల చేస్తున్న పాదయాత్రపై మాత్రం సాక్షి మీడియా ఫోకస్ పెంచింది. షర్మిల ఔదార్యం ఇదీ అంటూ ప్రత్యేకంగా కథనాలిస్తోంది. తాజాగా నల్లగొండ జిల్లాలో షర్మిల పాదయాత్ర చేస్తుండగా.. ఆ సమీపంలో ఓ రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు బైకులు ఢీకొని.. ఇద్దరికి గాయాలయ్యాయి. దీంతో వెంటనే స్పందించిన షర్మిల తన కాన్వాయ్ లోని అంబులెన్సులో గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. ఫోన్ చేసినా అంబులెన్సులు సమయానికి రావడం లేదని, కేసీఆర్ పాలనలో 108 సేవలు దారుణంగా తయారయ్యంటూ విమర్శించారు. ఈ మొత్తం స్టోరీని సాక్షి మీడియా ప్రత్యేకంగా కవర్ చేసింది.

తాజా సమీకరణలను చూస్తుంటే షర్మిలకు అన్న జగన్ కూడా మద్దతు ఇచ్చినట్టే కనిపిస్తోంది. షర్మిల పాదయాత్ర చూస్తుంటే మొత్తం జగన్ పాదయాత్రను తలపిస్తోంది. అప్పట్లో జగన్ పాదయాత్ర కోసం పనిచేసిన టీం మొత్తాన్ని ఇప్పుడు షర్మిల ఉపయోగిస్తున్నారని కూడా చెబుతున్నారు. ఇప్పటికే వైవీ సుబ్బారెడ్డి కూడా షర్మిలతో కలిశారు. మరోవైపున మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కూడా వచ్చే ఎన్నికల నాటికి, తెలంగాణలో షర్మిల పార్టీకోసం పనిచేస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇందుకోసం ఇప్పటికే గ్రౌండ్ వర్క్ కూడా పూర్తి చేసినట్టు చెబుతున్నారు. ఇలా ఇప్పటికే ఏపీలోని కొందరు నేతలను తెలంగాణ రాజకీయాల్లో దించేందుకు రంగం సిద్ధమైందని కూడా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో షర్మిల కోసం సాక్షి కూడా తనవంతు సాయం చేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: